గుంటూరుకు మెట్రో అక్కర్లేదా?

22 Sep, 2014 11:58 IST|Sakshi
గుంటూరుకు మెట్రో అక్కర్లేదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో రైలు వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తొలి దశలో అసలు గుంటూరు మెట్రోరైలు అవసరం లేదని, విజయవాడ నగరంలో మాత్రమే 25-26 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేస్తే చాలని రాష్ట్ర ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు ఇ.శ్రీధరన్ పేర్కొన్నారు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కానూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకూ 13 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్, బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు, ఐదో నంబరు జాతీయ రహదారికి లింకు కలుపుతూ 12, 13 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మాణానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. మెట్రోరైలు అనేది కేవలం ఒక నగర పరిధిలోనే ఉండాలి తప్ప ఇంటర్ సిటీ కాదని శ్రీధరన్ చెప్పారు. ప్రపంచంలో ఏ మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

వాస్తవానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గుంటూరు- విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేస్తామని, ఈ రెండు నగరాలను కలిపేలా మెట్రోరైలు కూడా వస్తుంది కాబట్టి రాజధానికి వచ్చిన సమస్య ఏమీ లేదని మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు 'మెట్రో గురు' శ్రీధరన్ చెప్పిన విషయంతో సర్కారీ పెద్దలు చెప్పినదంతా ఉత్తదేనని తేలిపోయింది.

మెట్రోరైలుకు కిలోమీటరకు రూ. 240 కోట్లు ఖర్చవుతుందని, విజయవాడలో మొత్తం మెట్రో నిర్మాణానికి 7,500 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని కూడా శ్రీధరన్ చెప్పారు. హైదరాబాద్లో చేపడుతున్నట్లుగా కాకుండా.. ఇక్కడ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మెట్రో రైలు నిర్మాణం చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు