కరోనా: విశాఖలో కేసులు తగ్గుముఖం?

14 Apr, 2020 10:46 IST|Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు నిల్‌.. మరోవైపు అనుమానితుల నుంచి సేకరించి పరీక్షలకు పంపిన శాంపిల్స్‌ అన్నీ దాదాపు నెగిటివ్‌గానే వచ్చాయి. మరో పది రిపోర్టులు మాత్రమే అందాల్సి ఉంది. ఇవన్నీ విశాఖలో కరోనా నెమ్మదిగా అదుపులోకి వస్తోందన్న ఆశావహ సంకేతాలనిస్తున్నాయి. మొదట్లో చాలా తక్కువస్థాయిలో ఉన్న కరోనా కేసులు.. తబ్లీగి ఘటనతో ఒక్కసారి పెరిగిపోయి.. అందవరకు ప్రభుత్వం, అధికారులు చేపట్టిన నియంత్రణ చర్యలను దాదాపు నిష్ఫలం చేశాయి. అయినా జిల్లా అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమించి నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేసింది.

దాని ఫలితమే.. కేసులు తగ్గుముఖం పట్టడం. జిల్లాలో కరోనా వైరస్‌ను పారదోలడానికి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్, తదితర శాఖలకు చెందిన ఉన్నత స్ధాయి నుంచి సాధారణ ఉద్యోగుల వరకు ప్రాణాలకు తెగించి రెడ్‌ జోన్లతోపాటు నగరం, జిల్లావ్యాప్తంగా ఆరోగ్య, పారిశుధ్య చర్యలు చేపట్టారు. దాంతో కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ఈనెల ఆరో తేదీన జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20కి పెరిగింది. అంతే.. అప్పటి నుంచి కేసుల పెరుగుదల లేదు.

పంపిన శాంపిల్స్‌ రిపోర్టులన్నీ నెగిటివ్‌గానే వస్తున్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం అందిన రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 10 రిపోర్టులు మాత్రమే అందాల్సి ఉంది. ఇప్పటికే కోవిడ్‌–19 బారిన పడి.. చికిత్స అనంతరం కొలుకున్న నలుగురిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 16 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 955 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 925 మంది రక్తపరీక్షల నమూనాలు నెగిటివ్‌ వచ్చాయి. సోమవారం ఒక్క రోజు 147 కేసుల్లో నెగిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వారం రోజులుగా నమోదుకాని కొత్త కేసులు ఇప్పటివరకు 20 కేసులే పాజిటివ్‌ మరో 10 రిపోర్టులు మాత్రమే పెండింగ్‌ సోమవారం వచ్చిన 147 రిపోర్టులు నెగిటివ్‌

మరిన్ని వార్తలు