నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు

6 Jul, 2014 02:10 IST|Sakshi

కడప అర్బన్ :తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని జమ్మలమడుగు 1వ వార్డు కౌన్సిలర్ ముల్లా జానీ వెల్లడించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో రిమ్స్ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఈనెల 2వ తేదీన గోవాకు వెళ్లానన్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో కంగారుపడిన తన తల్లి తనను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.
 
 మీడియాలో విభిన్న కథనాలు వెలువడుతుండటంతో అన్ని మీడియా సంస్థలకు ఫోన్ చేసి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సమాచారం ఇచ్చానన్నారు. అలాగే గోవా కోర్టులో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చానన్నారు. పోలీసుల సహాయంతో కడపకు వచ్చానన్నారు. కడప కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చానన్నారు. జమ్మలమడుగులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారనన్నారు.
 
 ఏ పార్టీ వారు తనకు ఫోన్ చేసి బెదిరించలేదన్నారు. ఈ సందర్భంగా జానీ తల్లి నూర్జహాన్ మాట్లాడుతూ తన కుమారుడు 2వ తేదీ  నుంచి కనిపించకపోవడంతో కంగారుతో కిడ్నాప్‌కు గురయ్యాడని జమ్మలమడుగు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. జమ్మలమడుగు అర్బన్ సీఐ సి.చంద్రశేఖర్ మాట్లాడుతూ జానీ తల్లి నూర్జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి అతని కోసం గోవా వెళ్లామన్నారు. గోవా కోర్టులో జానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని తీసుకుని   జిల్లా కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. దర్యాప్తులో నిజానిజాలు తెలియనున్నాయన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  ముల్లా జానీకి అతని కుటుంబసభ్యులకు భద్రత కల్పించామన్నారు. కాగా ముల్లాజానీ కనిపించకపోవడంతో జమ్మలమడుగులో రెండురోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడటం తెలిసిందే.  
 కోర్టులో ఉద్రిక్తత :
 జమ్మలమడుగు 1వ వార్డు కౌన్సిలర్  ముల్లాజానీని గోవా నుంచి కడప జిల్లా కోర్టుకు శనివారం ఉదయం పోలీసులు తీసుకొచ్చారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు కోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీల నాయకులు వచ్చి అతన్ని కలిసేందుకు ప్రయత్నించినా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతించలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి జిల్లా కోర్టుకు తన వాహనంలో వచ్చి తిరిగి వెళ్లారు.
 
 భారీ భద్రత మధ్య మీడియా కంట పడకుండా జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు శ్రీనివాసులు, మహబూబ్‌బాష, చంద్రశేఖర్, రాజగోపాల్‌రెడ్డి బందోబస్తు మధ్య కోర్టు నుంచి రిమ్స్ పోలీస్‌స్టేషన్‌కు సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ జానీ తల్లి నూర్జహన్, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.
 

>
మరిన్ని వార్తలు