పామాయిల్‌కు మంగళం

22 May, 2015 04:04 IST|Sakshi
పామాయిల్‌కు మంగళం

చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం  
సబ్సిడీ భారం భరించని సర్కార్
పేదలకు ఇక పామాయిల్ లేనట్లే
 

 అనంతపురం అర్బన్  : పేదలకు చౌకదుకాణాల ద్వారా అందే పామాయిల్ ఇక లేనట్లే. సబ్సీడీ భారమని ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దారిద్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నాయి. రేషన్‌కార్డుల లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే నిత్యావసర సరుకులలో బియ్యం, కిరోసిన్, గోధుమ పిండి పంపిణీలో 70 శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించగా.. 30 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. బియ్యం, కిరోసిన్, గోధుమ పిండి, పామాయిల్, పసుపు, చక్కెర, ఉప్పు, కారంపుడి లాంటి నిత్యావసర సరుకులు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పేద ప్రజలకు సరఫరా చేసేవి. అయితే.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని రాయితీలు భరించలేక కేవలం బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమ పిండి మాత్రమే సరఫరా చేస్తోంది. పేదలకు ఎంతో అవసరమైన పామాయిల్‌కు మాత్రం మంగళం పాడింది. సబ్సిడీతో కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులేత్తిసింది.  

 పామాయిల్ దిగుమతి ఇలా..
     గత కాంగ్రెస్‌ప్రభుత్వం పామాయిల్ దిగుమతిని విరివిగా చేసింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌ల్యాండ్ దేశాల నుండి సముద్రపు ట్యాంకర్ల ద్వారా దేశానికి పామాయిల్‌ను దిగుమతి చేసింది. రాష్ట్ర కోటాలో భాగంగా ట్యాంకర్ల ద్వారా పామాయిల్‌ను వైజాగ్, కాకినాడ ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలకు చేరేది.. అక్కడ విజయ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో ప్యాకెట్లుగా తయారు చేసి సబ్సిడీ ద్వారా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసేది. బహిరంగ మార్కెట్‌లో పామాయిల్ ప్యాకెట్ ధర రూ. 56 నుండి రూ. 60ల వరకు ఉండగా.. ప్రభుత్వం సబ్సిడీతో కార్డు లబ్ధిదారులకు రూ. 45లకు పంపిణీ చేసేది. నెలకు ఒక పామాయిల్ ప్యాకెట్ చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయడంతో పేదలకు ఎంతోకొంత ఊరటగా ఉండేది.

 కరువు జిల్లాపై తీవ్ర ప్రభావం :
 బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం పామాయిల్ ధర రూ. 66 నుండి రూ. 70ల వరకు చేరుకుంది. బహిరంగ మార్కెట్‌లో పేద ప్రజలు పామాయిల్‌ను కొనే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న 10,09,607 మంది కార్డు లబ్ధిదారులకు గతంలో ఒక్కొక్క కార్డు లబ్ధిదారునికి ఒక పామాయిల్ ప్యాకెట్  వచ్చేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి చేసుకోవడానికి బడ్జెట్‌పై ప్రభావం పడుతోందని సాకుతో పేద ప్రజలకు పామాయిల్‌ను అందని ద్రాక్షలా చేసింది.

మరిన్ని వార్తలు