నోపార్కింగ్

8 Sep, 2014 02:37 IST|Sakshi

 సాక్షి, నెల్లూరు: నిర్మాణ రంగానికి సంబంధించి నెల్లూరులో నిబంధన ల ఉల్లంఘన జోరుగా సాగుతోంది. భవన నిర్మాణ సమయంలో పార్కింగ్ స్థలం చూపి ప్లాన్ అప్రూవ్ చేయించుకుంటున్న బిల్డర్లు తర్వాత తమ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కార్పొరేషన్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి పార్కింగ్ స్థలాల్లోనూ అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లైన కనకమహల్‌సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ట్రంకురోడ్డు, పెద్దబజారు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్లు, షాపింగ్‌మాళ్లు, కాంప్లెక్సులు, కల్యాణ మండపాలే ఇందుకు నిదర్శనం.

వీటిలో 90 శాతం నిర్మాణాలకు పార్కింగ్ స్థలాలు లేవు. మొదట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను పార్కింగ్ స్థలంగా చూపి, ఆ తర్వాత దుకాణాలు నిర్మిస్తున్నారు. అపార్టుమెంట్లలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆయా ప్రదేశాల్లో వివిధ పనులపై వచ్చిన వారు వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్ జాం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ఏటా వంద కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లోనూ ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారం బయటపడింది.
 
 యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
 కార్పొరేషన్ అధికారుల అండతో నగరంలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 11 షాపింగ్ మాళ్లు, 233 షాపింగ్ కాంప్లెక్సులు, 31 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం భవనాలను పార్కింగ్ స్థలాలు లేవు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ ప్రముఖ ఫ్యాన్సీ షాపుల అధినేత కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ప్లాన్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను పార్కింగ్ ప్లేస్‌గా చూపారు. అనుమతులు మంజూరైన తర్వాత పార్కింగ్ ప్లేస్ మాయమైంది. కార్పొరేషన్ అధికారుల చేతులు తడపడంతో ఇప్పుడు వాహనాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 కోర్టు ఆదేశించినా..
 మాగుంట లేఅవుట్‌లో కొద్ది రోజుల క్రితం రోడ్డు స్థలాన్ని కొందరు అప్పటి అధికార పార్టీ అండతో ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. రికార్డుల ప్రకారం వారికి 11.11 అంకణాల స్థలం ఉండగా, 17.33 అంకణాల్లో నిర్మాణం ప్రారంభించారు. సెట్‌బ్యాక్ వదలకపోవడంతో పాటు రెండు వైపులా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమించారు. జీ ప్లస్ 1 పేరుతో కార్పొరేషన్‌లో ప్లాన్‌కు దరఖాస్తు చేసి, ఐదంతస్తుల నిర్మాణం చేపట్టారు.
 
 ఈ క్రమంలోనే తమ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారంటూ విశ్రాంత ఇరిగేషన్ అధికారి కార్పొరేషన్ అధికారులను ఆశ్రయించారు. విచారించిన అధికారులు నిర్మాణం అక్రమేనని, తాము అనుమతులు మంజూరు చేయలేదంటూ చేతులు దులుపుకున్నారు తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణంపై కోర్టు స్టే మంజూరు చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నిర్మాణం ఆగలేదు. భారీ ఎత్తున ముడుపులు అందడంతోనే అధికారులు మిన్నకుండిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు