ఆటవిడుపేది?

12 Dec, 2019 13:03 IST|Sakshi
విజయవాడ కృష్ణలంక సర్వీస్‌ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల

కాగితాలపైనే ప్లే గ్రౌండ్స్‌

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో మగ్గిపోతున్న విద్యార్థులు

తప్పుడు పత్రాలతో అనుమతులు పొందుతున్న యాజమాన్యాలు

ఇబ్రహీంపట్నంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో 1,100 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల అనుమతి పొందేటప్పుడు ఆట స్థలం ఉన్నట్టు పత్రాలు సమర్పించారు. అయితే గత నెల 30వ తేదీన డీఈఓ రాజ్యలక్ష్మి స్కూల్‌ను తనిఖీ చేయగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఆ పాఠశాలకు ప్లే గ్రౌండ్‌ లేదు. రోడ్డుపైనే పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. ఇదేంటి అనుమతి పొందిన సమయంలో మీకు ఆట స్థలం ఉన్నట్టు రికార్డుల్లో ఉంది కదా.. అని డీఈవో సమగ్రంగా విచారించగా.. స్కూల్‌కు ఆనుకొని ఉన్న రహదారినే ఆట స్థలంగా చూపి అనుమతి పొందినట్లు తేలింది. 

విజయవాడ కృష్ణలంకలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌ బ్రాంచ్‌లో చదువుతున్న విద్యార్థులు ఆటలు ఆడాలన్నా, మానసిక ఉల్లాసం కోసం మరేదైనా చేయాలన్నా కనకదుర్గ వారధి నుంచి విజయవాడ బస్టాండ్‌కు ఉన్న సర్వీస్‌ రోడ్డు ఎక్కాల్సిందే. ఈ పాఠశాలకు ప్లే గ్రౌండ్‌ కాదు కదా కనీసం ప్రార్థన చేయటానికి పది అడుగుల స్థలం కూడా లేని దుస్థితి.  జిల్లాలో వందలాది ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల పరిస్థితి ఇదే.. స్కూల్‌ ప్రారంభించేటప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి అనుమతులు పొందుతూ..ఆ తర్వాత విద్యార్థులను ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా మార్చేస్తూ.. అమూల్యమైన బాల్యాన్ని హరించేస్తున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో:  ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యార్థులను కేవలం ర్యాంకులు తెచ్చే సాధనాలుగానే యాజమాన్యాలు చూస్తున్నాయి. వారిలో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో పిల్లల్లో మానసికోల్లాసం కరువైంది. నిత్యం ఒత్తిడితోచిత్తు అవుతున్నారు. పాఠశాల స్థాయిలో జోనల్, మండల క్రీడా పోటీలు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే పాల్గొని విజేతలవుతుంటారు. కార్పొరేట్‌ పాఠ శాలల్లో చదివే విద్యార్థులకు క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా అవకాశమివ్వరు. వారి దృష్టంతా చదువుల మీదే ఉంచాలంటారు. దీనికి తోడు కార్పొరేట్‌ పాఠశాలలో విద్యార్థులను నిత్యం హోంవర్కు, స్లిప్‌ టెస్ట్‌ల పేరుతో కట్టడి చేస్తున్నారు. 

తప్పుడు పత్రాలతో అనుమతులు...?
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు 1,342 ఉండగా.. వాటిల్లో 4,10,705 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానం తప్పని సరి అని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు పత్రాలతో ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. పాఠశాలలు ప్రారంభించే వారు అనుమతుల కోసం వెళ్లేటప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలి. ఉన్నతాధికారులు వీటిని చూసి అనుమతులు మంజూరు చేయాలి. కానీ పాఠశాలలు తనిఖీ చేసేటప్పుడు గమనించిన దాఖలాలు లేవు. మరికొన్ని అనుమతుల సమయంలో దగ్గర్లో ఖాళీగా ఉన్న మైదానాలను చూపి పర్మిషన్లు పొందుతున్నారు. అనుమతులు ఇచ్చిన తర్వాత ఆవేవి కనిపించడం లేదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా