వరదకు దారేది?

23 Aug, 2018 12:25 IST|Sakshi
కొల్లేరు సరస్సులో అడ్డంగా నిర్మించిన రోడ్డు

రాష్ట్రంలో నదులు, వాగులు, వంకలను ఆక్రమిస్తున్న స్వార్థపరులు

భారీ వర్షం కురిస్తే నీరు వెళ్లే దారిలేక ముంపు ముప్పు

పెద్ద నగరాలు, పట్టణాల్లో  జాడలేని మురుగు కాలువలు

తరిగిపోతున్న అభయారణ్యాలు, కొండలు

ఒకటి రెండు రోజులు కుండపోత వర్షం కురిస్తే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం తప్పదు

వాతావరణ నిపుణుల ఆందోళన

సాక్షి, అమరావతి : 2005 జూలై 16న ఒకేరోజు (24 గంటల్లో) 94 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం అతలాకుతలమైంది. 2015లో ఒకేరోజు 41.3 సెంటీమీటర్ల వాన కురిస్తే చెన్నై రూపురేఖలు కోల్పోయింది. తాజాగా కుండపోత వర్షంతో కేరళలో పెను విషాదం అలుముకుంది. ఇలాంటి వర్షమే ఆంధ్రప్రదేశ్‌లో కురిస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు ఊహించాలంటేనే ఒళ్లు జలదరిస్తోందని వాతావరణ, విపత్తు నిర్వహణ నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ప్రకృతి ప్రకోపం నుంచి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న ముప్పు న్యూక్లియర్‌ బాంబు కంటే ప్రమాదకరమని చెప్పక తప్పదని అంటున్నారు.

ఆక్రమణల చెరలో నదులు, వాగులు  
స్వల్ప సమయంలో అత్యధిక వర్షం కురిస్తే వాననీరు త్వరగా బయటకు వెళ్లిపోయే మార్గం ఉంటే నష్టం తక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు లాంటి నగరాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లిపోయే మార్గాలు లేవు. నీటి ప్రవాహానికి వీలుగా సరైన మురుగు కాలువలు లేవు. కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలో ఒకేరోజు 28 సెంటీమీటర్ల వర్షం కురిస్తే పడవలపై ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోని పెద్ద నగరాలు, పట్టణాల్లో ఒకటి రెండు రోజులు కుండపోత వర్షం కురిస్తే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కొల్లేరు మంచినీటి సరస్సు పెద్ద రిజర్వాయర్‌లా ఉంది. రెండు జిల్లాల నుంచి ఎటువైపు నుంచి నీరు ఎక్కువగా వచ్చినా ఈ సరస్సు నుంచి సముద్రంలోకి నీరు వెళ్లిపోతుంది. అయితే, కొల్లేరును ఆక్రమించేశారు. చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. ఈ చెరువులు కాంక్రీట్‌ జంగిల్స్‌ లాంటివే. ఇందులో నీరు ఇంకదు. వాగులు, వంకలు ఆక్రమణలతో కుంచించుకుపోవడం వల్ల వరద నీరు ముందుకు వెళ్లే దారిలేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. రహదారులు ధ్వంసమవుతున్నాయి.

మనిషి స్వార్థంతో ప్రకృతికి చేటు
ఖనిజాలు, విలువైన రాళ్ల తవ్వకాల కోసం కొండలను పిండి చేస్తున్నారు. అభయారణ్యాలు తరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా చెట్లు నరికేస్తున్నారు. మైనింగ్‌తో కొండలు కరిగిపోతున్నాయి. నదులు, వాగులను ఆక్రమించడం, దారి మళ్లించడం, నదుల్లో ఇసుకను తోడేయడం వల్ల చాలా అనర్థాలు కలుగుతున్నాయి. నీరు నిదానంగా ప్రవహించడానికి ఇసుక ఎంతో అవసరం. ఇసుక నీటిని భూమిలోకి ఇముడ్చుకోవడంతోపాటు నీటిని పరుగెత్తకుండా నెమ్మదిగా నడిచేలా చేస్తుంది. నీరు వేగంగా ప్రవహిస్తే భూమిలోకి ఇంకిపోదు. ప్రవాహ వేగంవల్ల చెరువులు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోతాయి. అందుకే నదులు, వాగుల్లో ఇసుకను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ‘‘జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ 120 రోజుల నైరుతీ రుతుపవనాల కాలంలో గతంలో 84 రోజులకు పైగా వర్షాలు కురిసేవి. ఇప్పుడు వర్షపాతం తగ్గకపోయినా వర్షాలు పడే కాలం మాత్రం 84 నుంచి 60–65 రోజులకు పడిపోయింది. తక్కువ సమయంలోనే విపరీతమైన వర్షం కురిస్తోంది. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లే విపత్తులు కాటు వేస్తున్నాయి’’ అని విశాఖపట్నానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ భానుకుమార్‌ తెలిపారు.  


నదికి స్వేచ్ఛ ఉండాలి
వరుసగా రెండు రోజులు 30 సెంటీమటర్ల చొప్పున వర్షం కురిస్తే విజయవాడ, రాజధాని ప్రాంతం అమరావతి  ఏమవుతాయో చెప్పడమే కష్టం. కొండవీటి వాగు ఉప్పొంగితే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతోపాటు పరిసర గ్రామాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను పూడ్చేయడం, వాగులను ఆక్రమించి ఇళ్లు నిర్మించడం పెను ప్రమాదానికి సంకేతాలే. ‘‘నదులను ఆక్రమించుకోరాదు. నదికి స్వేచ్ఛ ఉండాలి. దానిపై ఒత్తిడి పెంచితే మనకే ముప్పు’’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రిటైర్డు అధికారి నరసింహారావు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు