ఆ కన్నీటికి బదులేది..?

11 Apr, 2019 12:37 IST|Sakshi
సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో బాధితులతో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కంబాల జోగులు(ఫైల్‌)

పురోగతి లేని ట్రేడ్‌ మోసం కేసు

ప్రజాక్షేత్రంలో నిందితులు 

కొమ్ముకాస్తున్న అధికార పార్టీ నాయకులు..?

సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సరిగ్గా 15 నెలలు క్రితం జిల్లాను కుదిపేసిన ట్రేడ్‌ బ్రోకర్‌ ఆన్‌లైన్‌ మోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో అధిక వడ్డీలు వస్తాయని చెప్పడంతో అనేక మంది సుమారు రూ.180 కోట్లు దీనిలో పెట్టుబడులు పెట్టారు. అనంతరం ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు పెట్టినవారు రోడ్డున పడ్డారు. దీనిపై నెల రోజుల వ్యవధిలో సివిల్‌ పోలీసులు కేసులోని పలు కీలక అంశాలను పట్టుకొని పలువురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం ఈ కేసు సీఐడీకి తరలించారు. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకూ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ మోసానికి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు అధికార పార్టీలోనే కొనసాగుతూ..చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారే ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల తరుపున ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

అధికార పార్టీ అండదండలతోనే..
సంతకవిటి మండలం తాలాడ గ్రామం వద్ద ఇండీట్రేడ్‌ పేరుతో మందరాడకు చెందిన టంకాల శ్రీరామ్‌ అనే యువకుడు ట్రేడ్‌ కార్యాలయాన్ని నిర్వహించాడు. అతను నాలుగేళ్లు వ్యాపారం చేసి పెట్టుబడులు సాధించిన అనంతరం పెట్టుబడులకు సంబంధించిన వడ్డీలు, వసులు ఇవ్వలేనని బోర్డు తిప్పేశాడు. 2017 నవంబర్‌ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్‌ బ్రోకర్‌ సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేయడంతో సంచలనం ఏర్పడింది. అప్పటివరకూ ఆ సంస్థలో తక్కువ పెట్టుబడులే ఉంటాయని అనుకుంటుండగా బాధితులంతా రోడ్డుపైకి వచ్చి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ సంస్థలో సుమారు రూ.180 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసి జిల్లా మొత్తం నివ్వెరపోయింది.

రోడ్డున పడిన బాధిత కుటుంబాలు
ఈ కంపెనీ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు తిరిగిరావని తెలిసి బాధితుల్లో ఇద్దరు అకాల మరణం చెందారు. వీరిలో సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు ఒకరు. ఆయనే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎంతో కష్టపడి గ్రామంలో ఉన్నతంగా ఎదిగారు. ఎంతో మందికి న్యాయం చేయడంతో పాటు మోసగాళ్లకు బుద్ధి చెప్పేవాడు. అలాంటి అతనే చివరికి ట్రేడ్‌ బ్రోకర్‌ చేతిలో మోసపోయానని తెలుసుకుని గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా మారింది. ఇదే మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడమ్మ కూడా ఇదే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. మనుమరాళ్ల వివాహం నిమిత్తం పెట్టుబడి పెట్టిన నగదు తిరిగిరాదని తెలుసుకుని ఆస్పత్రిపాలై చివరకు మృతి చెందింది. అప్పటి నుంచి ఆ కుంటుంబాలలో నుంచి విషాదచాయలు తొలిగిపోలేదు. ఎంతోమంది ఎప్పటికైనా డబ్బు తిరిగి వస్తుందని గుండెల నిండా ఆశతో జీవిస్తూ ఉన్నారు. 

అసలు ప్లాన్‌ ఎవరిది..? 
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్‌ యంత్రాంగంతో పాటు అప్పటి పాలకొండ డీఎస్పీ జి.స్వరూపరాణి శరవేగంగా కేసును దర్యాప్తు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, ఫిర్యాదుల ఆధారంగా బ్రోకర్‌ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సమయంలో నిందితులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేయగా కేసును ముందుకు నడిపించేందుకు సీఐడీకి అప్పగించారు. అయితే కేసు నేటికీ నడుస్తూనే ఉంది. మోసం వెనుక అసలు ఎవరు ఉన్నది తెలియడం లేదు.

అయితే దీని వెనుక సంతకవిటి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చా యి. కానీ ఇప్పటికీ వీటి వెనుక కొత్త విషయాలు వెలుగులోకి రావడం లేదు. ఈ ఉదంతం జరిగి 15 నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన కుటుంబాలు రోడ్డున పడి విలపిస్తుండగా, నిందుతులు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా కేసులో వేగం పెంచి నిందితుల నుంచి డబ్బును రికవరీ చేయాలని కోరుతున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు