ఒళ్లు హూనమైనా ఆదాయం అత్తెసరే!

8 Oct, 2017 01:24 IST|Sakshi

రాష్ట్రంలో రైతు కుటుంబాల వార్షిక ఆదాయం రూ.71,528 మాత్రమే

ఇందులో వ్యవసాయం ద్వారా వచ్చేది కేవలం రూ.24,209

హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో రైతులకు అత్యధిక ఆదాయం 

పలు పంటల ఉత్పాదకతలోనూ వెనుకబడిన రాష్ట్రం 

మొక్కజొన్న, జొన్న ఉత్పాదకతలో మాత్రం ముందంజ

రాష్ట్ర ప్రభుత్వ స్వీయ నివేదిక స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకూ అధ్వానంగా మారుతోంది. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని, ఒళ్లు హూనమయ్యేలా ఇంటిల్లిపాదీ కష్టపడినా.. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు కూడా పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకవేళ అరకొరగా పంట చేతికందినా, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు. రాష్ట్రంలో ఏడాదంతా కష్టపడితే సగటున ఒక రైతు కటుంబానికి వచ్చే ఆదాయం రూ.71,528 మాత్రమే అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇందులో కూడా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 24,209 రూపాయలే. మిగతా ఆదాయం పాడి, వ్యవసాయేతర కూలి పనుల రూపంలో వస్తోంది.

వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంలో, పంటల ఉత్పాదకతలో రాష్ట్రంలో రైతులు మిగతా రాష్ట్రాలతో పోల్చితే బాగా వెనుకబడిపోయారు. ఈ వాస్తవాలన్నీ ఎవరో దానయ్యలు చెప్పినవి కావు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలోనివే. వ్యవసాయ రంగంలో రాష్ట్ర స్థితిగతులు, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి.. లోపాలు అధిగమించి, రైతుల ఆదాయం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదిక తయారు చేసింది. వివిధ రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా విషయాల్లో మనం వెనుకబడి ఉన్నామని ఈ నివేదిక తేల్చింది. రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 34 శాతం మాత్రమే వ్యవసాయం ద్వారా వస్తోందని, ఈ ఆదాయంతో ఇల్లు గడవడం కష్టం కావడంతో చాలా వరకు రైతు కుటుంబాలు కూలి పనులకు వెళ్తున్నట్లు నివేదికలో పేర్కొంది. 

ప్రధాన పంటల ఉత్పాదకతలో వెనుకబాటు
వ్యవసాయ ఆదాయంలో, వ్యవసాయ కుటుంబాల మొత్తం ఆదాయంలో హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. పంజాబ్‌లో సగటున వ్యవసాయ కుటుంబం వార్షిక ఆదాయం రూ.2,17,459 కాగా, ఇందులో వ్యవసాయం ద్వారా రూ.1,30,163 వస్తోంది. అంటే మొత్తం ఆదాయంలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం అన్నమాట. హరియాణాలో సగటున వ్యవసాయ కుటుంబం వార్షిక ఆదాయం రూ.1,74,163 కాగా, ఇందులో వ్యవసాయం ద్వారా రూ.94,411 (మొత్తం ఆదాయంలో 54 శాతం) వస్తోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో పలు పంటల ఉత్పాదకత కూడా బాగా తక్కువగా ఉంది. వరితో పాటు ప్రధాన పంటల ఉత్పాదకతలో బాగా వెనుకబడిపోయింది.

ఈ విషయంలో పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో కంటే పంజాబ్‌లోనే వరి ఉత్పాదకత ఎక్కువగా ఉంది. వేరుశనగ కూడా మనకంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉత్పాదకత ఎక్కువ. పత్తి ఉద్పాదకతలో గుజరాత్, చెరుకు ఉత్పాదకతలో పశ్చిమబెంగాల్‌లు ముందంజలో ఉన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో కంది, పెసర, జొన్న, ఆముదం, పొద్దు తిరుగుడు పంటల ఉత్పాదకతలో కూడా మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉంది. అయితే రబీలో మొక్కజొన్న, జొన్న ఉత్పాదకతలో మాత్రం మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో ఎక్కువగా ఉంది. కాగా, పలు లోపాలను అధిగమించి రైతు కుటుంబాల ఆదాయం పెంచాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన కార్యాచరణ  ప్రభుత్వం వద్ద లేదని పలువురు వ్యవసాయరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు