మూడు రాజధానులు వద్దట! అమరావతే ముద్దట 

27 Dec, 2019 09:55 IST|Sakshi
శ్రీకాకుళంలో టీడీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ

వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్న కొందరు నేతలు 

వెనుకబడిన జిల్లాలకు నష్టం చేసే యత్నాలు  

ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతున్న పరిస్థితి 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అమరావతికి కట్టబడి ఉండాలన్న ప్రకటనపై టీడీపీలో ఒకపక్క ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు బయటపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు తెలిపారు. మరికొందరు నేతలు లోపాయికారీగా చర్చించుకుంటున్నారు. తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్న పళంగా పార్టీ చీలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన పార్టీ అధిష్టానం నష్ట నివారణ కోసం తమ చెప్పుచేతల్లో ఉండే కొందరు నేతలను రంగంలోకి దించింది. వారి చేత ‘మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు’ అనే నినాదంతో ర్యాలీలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాకపోతే, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు సైతం కలిసి రాకపోవడంతో 30 మందితో మమ అనిపించే పరిస్థితి ఏర్పడింది.

ఎక్కడ చూసినా అదే చర్చ..
ప్రస్తుతం ఎక్కడ చూసినా మూడు రాజధానుల చర్చే జరుగుతున్నది. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై మద్దతు వెల్లువెత్తుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయబోతున్నారన్న ప్రతిపాదిత ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అభివృద్ధికి నోచుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకనే అన్ని వర్గాలు మూడు రాజధానుల ప్రకటన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాయి. ఎక్కడికక్కడే రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ సదస్సులు నిర్వహించి తమ ఆనందాన్ని, మనోగతాన్ని, అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ప్రతి ఏరియాలోనూ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను చేయాలన్న ప్రతిపాదిత ప్రకటనపై చర్చ జరుగుతున్నది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, కారి్మకులు, కర్షకులు తదితర వర్గాలన్నీ రాజకీయాలకు అతీతంగా సమాయత్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజల నాడిని గమనించి కొందరు నేతలు బయటపడుతున్నారు. రాజధానికి అనుకూలంగా మద్దతు పలుకుతున్నారు. అవసరమైతే చంద్రబాబు అజెండాను వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నారు. తప్పదని అధిష్టానం ఒత్తిడి చేస్తే పార్టీ మారడానికైనా సై అంటున్నారు. ప్రజాభిప్రాయానికి ఎవరైనా తలొగ్గక తప్పదని, మన ప్రాంత అభివృద్ధికి కట్టుబడేలా ఉండాలని అత్యధిక టీడీపీ నేతలు ప్రస్తుతం లోపాయికారీగా చర్చించుకుంటున్నారు. దీంతో టీడీపీ నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి స్పష్టమవుతోంది.

చక్కదిద్దేందుకు యత్నాలు  
రోజురోజుకూ పార్టీలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెంది చక్కదిద్దే కార్యక్రమానికి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాను చెప్పినట్టు వినే నేతలను రంగంలోకి దించి, వారి చేత అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయించి, అదే మాట ప్రజల్లోకి గట్టిగా వెళ్లేలా చేసి, మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న టీడీపీ శ్రేణుల మనసు మార్చే కార్యక్రమాన్ని తలపెట్టారు.  కానీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఎత్తులను తిప్పికొడుతున్నారు. ఎన్ని జిత్తుల మారి ఎత్తులు వేసినా తమ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్దామని, భజన చేసే నాయకుల ట్రాప్‌లో పడేది లేదని చెప్పకనే చెబుతున్నారు.

దానికి ఉదాహరణ శ్రీకాకుళంలో గురువారం సాయంత్రం చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ. మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు అనే నినాదంతో చేసిన ర్యాలీలో 30 మందికి మించి కన్పించలేదు. నిత్యం రద్దీగా ఉండే ఏడు రోడ్ల జంక్షన్‌లో చేపట్టిన కొవ్వుత్తుల ర్యాలీకి జనాల నుంచి స్పందన లేదంటే వారు ఎత్తుకున్న నినాదానికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖను రాజధాని చేస్తే వీరికొచ్చే నష్టమేంటి? అమరావతిలో కొన్న భూముల విలువ తగ్గిపోతుందన్న భయమా? రాజకీయంగా కనుమరుగైపోతామన్న ఆందోళనా? అని ప్రజలు పెదవి విరిచిన పరిస్థితి కని్పంచింది. వీరి చేష్టలు చూస్తుంటే వెనకబడిన జిల్లాలకు నష్టం చేసేలా ఉన్నారని, నాడు రాష్ట్ర విభజనలో ఏ రకంగానైతే ద్వంద్వ నీతిని ప్రదర్శించి మోసగించారో ఇప్పుడలా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే వాపోయారు.   

మరిన్ని వార్తలు