రికవరీ ఏదీ?

25 Aug, 2014 02:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: వలస జీవితాలకు స్వస్తి పలికి స్వగ్రామాల్లోనే ఉపాధి పనుల ద్వారా కూలీలకు భృతి కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమంది సిబ్బందికి కల్పతరువుగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని ఫీల్డ్‌అసిస్టెంట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నా రికవరీ చేయకుండా జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.7.5 కోట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు స్వాహా చేశారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. అందుకు నిదర్శనం వీరబల్లి ఫీల్డ్‌అసిస్టెంట్ ఉదంతం.
 
చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన పీడీ..
జిల్లాలో ఇప్పటివరకు 8సార్లు సోషల్ ఆడిట్ నిర్వహించారు. అందులో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని గుర్తించి రికవరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు సుమారు రూ. 7.5 కోట్లు  అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. అందులో సుమారు రూ.2.5 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన మొత్తం రికవరీలో జాప్యం జరుగుతోంది. అందుకు కారణం మండల స్థాయిలో ఉండే ఏపీఓలేనని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంపై వీరబల్లి మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం రూ.18.53 లక్షల రికవరీకి డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం ఆదేశించారు.
 
మే 24న ఆమేరకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఐదుమంది ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగించి రిక వరీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అందులో రమేష్‌బాబు అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరే రూ.16లక్షలు స్వాహా చేశారు. ఇప్పటి వరకూ స్థానిక ఏపీఓ చిన్నపాటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఉన్నతాధికారులకు మాత్రం ఫీల్డ్‌అసిస్టెంట్ పరారీలో ఉన్నట్లు రికార్డులు పొందుపర్చినట్లు సమాచారం. అయితే రమేష్‌బాబు యథేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసి దర్జాగా స్థానిక రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. అధికారపార్టీ అండతో స్వాహా మొత్తంలో చిల్లిగవ్వ కూడా రికవరీ కాకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది.  
 
రమేష్‌బాబు వ్యవహారం పరిశీలిస్తాం... పీడీ బాలసుబ్రమణ్యం
జిల్లాలో ఉపాధి సొమ్ము స్వాహాపై రికవరీ చేస్తున్నాం. సోషల్ ఆడిట్‌లో తప్పు చేశారని తేలిన సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. ఏ ఒక్కరినీ వదలడంలేదు.  వీరబల్లి ఫీల్డ్‌అసిస్టెంట్ రమేష్‌బాబు వ్యవహారాన్ని పరిశీలిస్తా. తన ఆదేశాలను ఏపీఓ ఎందుకు అమలు చేయలేదో పరిశీలిస్తాను.

మరిన్ని వార్తలు