వరకట్న కేసుల్లో రెడ్‌కార్నర్ నోటీసులకు ఇంటర్‌పోల్ ‘నో’

16 Jul, 2013 04:36 IST|Sakshi
వరకట్న కేసుల్లో రెడ్‌కార్నర్ నోటీసులకు ఇంటర్‌పోల్ ‘నో’

- ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లు కేసులను లెక్కచేయని పరిస్థితి
- 498(ఏ)తోపాటు 406, 420 సెక్షన్లను కూడా జతపరిచే యత్నం
- పెళ్లికిముందే జాగ్రత్తలు ఉత్తమం అంటున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులకు పాల్పడుతున్న ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకులను ఇక్కడకు తీసుకువచ్చేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేస్తున్నారు. ఐపీసీ 498(ఏ) ప్రకారం వరకట్న వేధింపుల కేసులు నమోదైన వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీజేసేందుకు ఇంటర్‌పోల్ నిరాకరిస్తోంది. విదేశీ చట్టాల ప్రకారం వరకట్న వేధింపుల వ్యవహారం తీవ్రమైన నేరంగా పరిగణించడంలేదు. అయితే గతంలో భారత చట్టాల ప్రకారమే రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసేవారు. కానీ అక్కడి ప్రభుత్వాల సూచన మేరకు ఈ కేసుల్లో రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయరాదని ఇంటర్‌పోల్ ఇటీవల నిర్ణయించింది.

బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా నిందితులకు సంబంధించిన ఆచూకీని తెలియజేసేందుకు మాత్రం అంగీకరించింది. ఇప్పటివరకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసే అవకాశం ఉండటంతో ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకుల్లో భయం ఉండేదని, నోటీసు జారీఅయిన వెంటనే భార్యను కాపురానికి తీసుకువెళ్లడం, రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం జరిగేదని రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) అధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు వివరించారు. బ్లూకార్నర్ నోటీసులవల్ల కేసులు నమోదైనప్పటికీ లెక్కచేయని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే ఈ కేసుల్లో రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

పంజాబ్ తరువాత మన రాష్ట్రంలోనే అత్యధికం
ఎన్‌ఆర్‌ఐ వరకట్న బాధిత కేసులు భారతదేశంలో పంజాబ్ తరువాత మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకులపై నమోదైన కేసుల్లో రెడ్‌కార్నర్ నోటీసులకోసం దేశవ్యాప్తంగా మూడు వేల కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో మన రాష్ట్రానికి సంబంధించినవి సుమారు 150కిపైగానే ఉన్నాయి. దీంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి అనేక కేసుల్లో రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయించడంలో సీఐడీ కీలక భూమిక పోషించింది. ప్రస్తుతం బ్లూ కార్నర్ నోటీసులకు సంబంధించి 200 కేసుల వరకూ ఉన్నట్లు సమాచారం.

దీంతోపాటు బాధిత మహిళలు ఆయా దేశాల్లో ఏయే సంస్థల నుంచి న్యాయ సహాయం పొందవచ్చు, ఏ విధంగా కేసులు నమోదు చేయవచ్చు అనే విషయాలపై అవగాహన కలిగించేందుకు కూడా సీఐడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విదేశీ చట్టాలకు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఐ వరకట్న వేధింపుల కేసుల్లో కొత్త సెక్షన్లు చేర్చాలని కూడా పోలీసుశాఖ భావిస్తోంది. ఇకనుంచి వరకట్న వేధింపులకు సంబంధించి 498(ఏ)తోపాటు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింది 406, చీటింగ్ నేరం కింద 420 సెక్షన్లను కూడా జతచేయనున్నారు.

406 సెక్షన్ కింద కేసు నమోదు చేయడంవల్ల వివాహ సమయంలో లాంఛనాలుగా ఇచ్చిన వధువు వస్తువులను తక్షణమే పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకుల వరకట్న వేధింపుల కేసుల్లో 406 సెక్షన్ చేర్చడం ఎప్పటి నుంచో ఉంది. కేసు నమోదు చేసిన వెంటనే మెట్టినింట్లో ఉండే బాధిత మహిళలకు సంబంధించిన వస్తువులను తక్షణమే స్వాధీనం చేసుకుని కోర్టుకు అందిస్తారు. దీంతోపాటు 420 కింది చీటింగ్ కేసు కూడా నమోదు చేస్తారు. విదేశీ చట్టాల ప్రకారం 406, 420 సెక్షన్లు ముఖ్యమైనవి. దీంతో రెడ్‌కార్నర్ నోటీసు ద్వారా ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకులను ముక్కుపిండి ఇక్కడకు తీసుకురావడం సాధ్యమవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

ముందు జాగ్రత్తే ఉత్తమం
ఎన్‌ఆర్‌ఐ సంబంధాల విషయంలో ముందు జాగ్రత్తే ఉత్తమమని సీఐడీ ప్రత్యేక విభాగం ఉన్నతాధికారులు అంటున్నారు. పెళ్లి సంబంధాల మొదటి దశలోనే వరుడికి సంబంధించిన పూర్తి వివరాలను, అతను పనిచేసే సంస్థకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న తరువాతే ఒక నిర్ణయానికి రావాలని సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ సూచించారు. వరుడుకి సంబంధించిన పాస్‌పోర్టు తదితర వివరాలతోపాటు అక్కడ ఉండే అతని స్నేహితులతో కూడా మాట్లాడటం ఉత్తమమన్నారు.

మరిన్ని వార్తలు