మహిళలకు ఇవ్వరట!

11 May, 2015 05:28 IST|Sakshi
మహిళలకు ఇవ్వరట!

ఉద్యోగుల ఎంపికలో జోరుగా పైరవీలు
బస్సుల్లో టికెట్లు కొట్టని కొత్త కండక్టర్లు
వారు తెచ్చి ఇచ్చిందే రెవెన్యూ..
బస్సులు తిప్పితే భారీగా నష్టం
డ్రైవర్లు, కండక్టర్లకు డబ్బులు తగ్గించి ఇస్తున్న అధికారులు
ఆందోళనలో తాత్కాలిక ఉద్యోగులు

 
 నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలికంగా నియమించుకునే యువతకు సంబంధించి డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడంతో భారీగా నిరుద్యోగులు ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు చేరుకున్నారు. సుమారు రెండు వేల మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు ఆయా బస్‌స్టాండ్లకు చేరుకున్నారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి తమ సర్టిఫికెట్లను అధికారులకు అందజేశారు.

హెవీ లెసైన్స్ ఉన్నవారిని మాత్రమే డ్రైవర్లగా అధికారులు నియమించారు. టెన్త్ పాసైన వారిని కండక్టర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. అయితే తాత్కాలిక ఉద్యోగాల్లో పైరవీలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు, తెలిసిన వారి ద్వారా వచ్చిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారని సమాచారం.

మహిళలను పక్కనబెట్టిన అధికారులు
 తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు మహిళలు అధికసంఖ్యలో ఆయా బస్‌స్టాండ్లకు చేరుకున్నారు. మొదటిరోజు ఒకరిద్దరు మహిళలు ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఇవ్వలేదన్న కారణంతో వారిని విధుల్లో నుంచి తొలగించారు. వీరితో పాటు కండక్టర్ ఉద్యోగం చేపట్టేందుకు ధ్రువపత్రాలు ఇచ్చిన పలువురు మహిళలను కూడా విధులకు దూరంగా పెట్టారు.

విధుల్లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువువతుందని పలువురు మహిళలు వాపోయారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా బస్‌స్డాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నా తమను విధుల్లోకి తీసుకోలేదని మహిళలు వాపోయారు.

 టికెట్లు కొట్టని కొత్త కండక్టర్లు
 కొత్తగా కండక్టర్లు ఎవరూ బస్సుల్లో టికెట్లు కొట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆర్టీసీకి భారీనష్టం వస్తుందని అధికారులే చెబుతున్నారు. పలువురు కండక్టర్లు వసూలు చేసిన దానిలో కొంతమాత్రమే అధికారులకు అప్పజెబుతున్నారని సమాచారం. ఉదాహరణకు నెల్లూరు బుచ్చి రూట్‌కు రోజు రూ. 5వేలు వస్తుంది. కానీ కొత్తగా నియమించిన కండక్టర్లు రూ.2వేలు మించి అప్పజెప్పడం లేదు. దీంతో డబ్బులు తగ్గించి ఇచ్చిన వారిని తొలగించి మళ్లీ కొత్తవారిని విధుల్లోకి తీసుకుంటున్నారు.
 
తక్కువగా ఇస్తున్న రోజు వేతనం
 తాత్కాలిక డ్రైవర్‌కు రోజుకు రూ.1000, కండక్టర్‌కు రూ.800 చెప్పిన అధికారులు తక్కువ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. డ్రైవర్‌కు రూ.500, కండక్టర్‌కు రూ.400కు మించి ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశిస్తే రోజుకు 300 కిలోమీటర్లు తిరిగి డ్రైవర్‌కు మాత్రమే ఆ వేతనం వర్తిస్తుంద ంటున్నారు. వేతన విషయం ముందే ఎందుకు చెప్పలేదంటూ శనివారం బుచ్చికి వెళ్లే బస్సుకు డ్రైవర్‌గా విధులు నిర్వహించిన ఓ వ్యక్తి వాదనకు దిగారు.

 ఈ విషయంలో తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ వ్యక్తి తన సర్టిఫికెట్‌ను తిరిగి ఇచ్చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదే రీతిలో పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు డబ్బులు ఇస్తుండడంతో నిత్యం అక్కడ వివాదం చోటుచేసుకుంటుంది.

>
మరిన్ని వార్తలు