సీఆర్‌డీఏ నియామకాల్లో... ‘నో’ రిజర్వేషన్స్

17 Apr, 2016 06:18 IST|Sakshi
సీఆర్‌డీఏ నియామకాల్లో... ‘నో’ రిజర్వేషన్స్

* చంద్రబాబు ప్రభుత్వ కొత్త విధానం  
* ఏపీపీఎస్సీకి ఎలాంటి సంబంధమూ ఉండదు

సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో అనేక ‘వృథా’ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీఆర్‌డీఏ)లో రిక్రూట్‌మెంట్ల విషయంలో రిజర్వేషన్లు అమలు చేయరాదని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక మానవవనరుల విధానాన్ని కూడా సీఆర్‌డీఏ రూపొందించింది. దీంతో గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన ‘సీఆర్‌డీఏ మానవ వనరుల విధానం’ రద్దయిపోయినట్లే.

అంటే ఇక సీఆర్‌డీఏలో ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా మారిపోనుంది. అంతేకాదు కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు కూడా ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చినవారిని నియమించుకునే వీలేర్పడనున్నది. ఇక సీఆర్‌డీఏ నియామకాల విషయంలో ఏపీపీఎస్సీకి ఎలాంటి సంబంధమూ ఉండదు. కార్పొరేట్ తరహాలో రిక్రూట్‌మెంట్ ఉంటుందని పాలసీలో ప్రముఖంగా ప్రస్తావించారు.
 
కార్పొరేట్ తరహా రిక్రూట్‌మెంట్!
సీఆర్‌డీఏలో శాశ్వత నియామకాల్లో గానీ, కాంట్రాక్టు నియామకాల్లో గానీ ఇక ఎలాంటి రిజర్వేషన్లను పాటించరు. కేవలం వారి విద్యార్హతలు, టాలెంట్ ప్రాతిపదికనే నియమాకాలను చేయనున్నట్లు నూతనంగా రూపొందించిన మానవ వనరుల పాలసీలో పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల తరహాలోనే రిక్రూట్‌మెంట్ విధానం ఉంటుందని పాలసీలో పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయాలంటే ప్రతికల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారు. కాంట్రాక్టు విధానంలో గానీ, రెగ్యులర్ విధానంలో గానీ  తీసుకునే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఉంటుంది.

అవసరమైన కేసుల్లో సీఆర్‌డీఏ కమిషనర్ అనుభవంలోను, విద్యార్హతల్లోను మినహాయింపులు ఇస్తారు. నూతన రిక్రూట్‌మెంట్‌కు ప్రకటన ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆ దరఖాస్తులను మానవ వనరుల గ్రూప్ పరిశీలిస్తుంది. రాత పరీక్షతో పాటు అవసరమైన పక్షంలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను సెలక్ట్ చేస్తారు. రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థి చదివిన విద్యతో పాటు ఆ చదివిన సంస్థకున్న పేరు ప్రతిష్టలు, అనుభవం, రాత పరీక్ష, మానసిక పరిస్థితి, ఇంటర్వ్యూకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు విధానంలో పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్ధులకు ఆఫర్ లెటర్ జారీ చేస్తారు. అనంతరం వైద్య పరీక్షల సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.  ఉద్యోగిగా పనిచేయడానికి సరిపోతారని వైద్య పరీక్షల్లో తేలితేనే ఉద్యోగంలో చే ర్చుకుంటారు. లేకపోతే ఆఫర్ లెటర్‌ను రద్దు చేస్తారు. సీఆర్‌డీఏ ఉద్యోగాలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా విధానంలో పేర్కొన్నారు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ధారించారు. అయితే అథారిటీ ఎవరినైనా 60 ఏళ్ల పైబడిన వారిని కూడా కాంట్రాక్టు విధానంలో తీసుకోవచ్చునన్నారు.ఉద్యోగుల ప్రొబేషన్ సమయం ఏడాదిగా నిర్ధారించారు. ఇంకా ఐటీ వినియోగంతో పాటు డ్రెస్ కోడ్ పాటించాలని  ఆ విధానంలో పేర్కొన్నారు.
 
నచ్చినవారిని నియమించుకోవడం కోసమే
‘సీఆర్‌డీఏ మానవ వనరుల విధానం’ ఇలా ఉండాలంటూ గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన 81, 82, 83 జీవోల స్థానంలో నూతనంగా రూపొందించిన మానవ వనరుల పాలసీని ఆమోదించాలంటూ సీఆర్‌డీఏ అధారిటీ ఆమోదానికి కమిషనర్ సమర్పించారు. గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన జీవోల్లో సీఆర్‌డీఏ రిక్రూట్‌మెంట్ విధానంలో  1996 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండ్ సబ్-ఆర్డినేట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు.

అంతే కాకుండా డెరైక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ఆ జీవోల్లో పేర్కొన్నారు. అయితే ఆ జీవోల మేరకు రిక్రూట్‌మెంట్ చేస్తే తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలు  భావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల సూచనలు, ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ కొత్తగా మానవ వనరుల విధానాన్ని రూపొందించిం ది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఆమోదించిన వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుంది.

మరిన్ని వార్తలు