కష్టాలు.. కన్నీళ్లు

11 Dec, 2013 02:19 IST|Sakshi

 ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడేళ్లుగా పసుపు, అల్లం, పిప్పళ్లతో పాటు సీజనల్‌గా పండించే రాజ్‌మా,బస్తర్లు, కూరగాయలు, పూల ధరలు దిగజారి పోతున్నాయి. సరైన మార్కెట్ సదుపాయం లేదు. సంతలనే ప్రధాన మార్కెట్లుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. తప్పుడు తూకాలు, దళారుల మోసాల నుంచి కాపాడే అధికారులే లేకుండా పోయారు. వ్యాపారులు కుమ్మక్కయి ధర తగ్గించడం, తరుగు పేరుతో కిలోలకు కిలోలే దిగమింగుతూ రైతులను నట్టేట ముంచేస్తున్నారు.
 
 పాడేరు/పెదబయలు,న్యూస్‌లైన్: గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రూ.లక్షలు గడిస్తుండగా అష్టకష్టాలు పడిన సాగు చేసిన గిరిపుత్రులకు మోత కూలి ద క్కని దుస్థితి నెలకొంటోంది. ప్రధాన వాణిజ్య పంటలైన పసుపు, పిప్పళ్లకు రికార్డు ధర ఉన్నప్పటికీ గతేడాది నుంచి వీటిని వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 2011లో కిలో పిప్పళ్లు రూ.300 నుంచి రూ.400లకు అమ్ముడుపోగా గతేడాది రూ.250 నుంచి 300 ధర అమలు చేశారు. ఈ సీజన్ ప్రారంభంలో కేవలం రూ.150 నుంచి రూ.170కు కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు. పసుపు పరిస్థితి ఇలాగే ఉంది. పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నప్పటికీ నాణ్యమైన ఏజెన్సీ పసుపును కుంటి సాకులతో ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
 
 సిండికేట్‌గా వ్యాపారులు
 ప్రకృతి వైపరీత్యాలతో మూడేళ్ల నుంచి రాజ్‌మా పంటకు నష్టం వాటిల్లుతోంది. దిగుబడులు తగ్గుతున్నాయి. మద్దతు ధర లభించడంలేదు.  వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధర తగ్గించేస్తున్నారు. మైదానంలో రాజ్‌మాకు డిమాండ్ ఉన్నప్పటికీ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన వాణిజ్య పంట అయిన కాఫీ కూడా గిరిజన రైతులను ఆదుకోవడం లేదు. బెంగళూరు మార్కెట్‌లో డిమాండ్ లేదనే కారణం చూపి   తక్కువ ధరకు కాఫీ గింజలను కొనుగోలు చేస్తున్నారు. అడవుల్లో సేకరించే అడ్డాకులకు ఆదరణ కరువైంది. మూడే ళ్లుగా జీసీసీ అడ్డాకులు కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరతోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు.
 
 గోదాముల్లేక అవస్థలు
 సంతకు తెచ్చిన సరకులు భద్రపరుచుకోవడానికి గోదాములు లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ధర లేనప్పుడు నిల్వ చేసుకునే అవకాశం లేక తిరిగి ఇంటికి తీసుకువె ళ్లలేక వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకుని నష్టపోతున్నారు. గిరిజనుల అమాయకత్వం, నిస్సహాయత వ్యాపారులకు వరంగా మారింది. జీసీసీ కూడా గిరిజనులు పండించిన పంటలు, సేకరించిన అటవీ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు వ్యాపారుల మోసాలకు గురవుతున్నారు
 
 మార్కెట్‌లో ధరల మోత  
 గిరిజన రైతులు తమ పంటలను నేరుగా మైదాన ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకునేందుకు వీలు కల్పిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. బంగాళా దుంపలను రైతుల నుంచి వ్యాపారులు కిలో రూ.12 నుంచి రూ.15 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అవే బంగాళా దుంపలు మైదాన ప్రాంతంలో పాటు ఏజెన్సీతో దుకాణాల్లో కిలో రూ.40 వరకు అమ్ముతున్నారు. అన్ని కూరగాయల ధరలు ఇదే మాదిగా ఉంటున్నాయి.
 
 ఇలా చేస్తే బావుంటుంది...
 దళారీ వ్యాపారుల బారి నుంచి గిరిజన రైతులను కాపాడేందుకు తక్షణం అధికారులు చర్యలు తీసుకోవలసి ఉంది. గిరిజనులు పండించిన సరకులను నిల్వ చేసుకునేందుకు మండల కేంద్రాల్లో గోడవున్లు, కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి వార పు సంతలో ధర్మకాటాలు ఏర్పాటు చేయడం లేదా ప్రయివేట్ వ్యక్తుల కాటాను ఎప్పటిప్పుడు తనిఖీలు నిర్వహించి తప్పుడు తూకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. దీనిపై ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి మార్కెటింగ్ సదుపాయం, గిట్టుబాటు ధర కల్పించాలని ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు