తుస్సుమన్న బస్సు యాత్ర

26 Mar, 2014 04:23 IST|Sakshi

 సాక్షి, తిరుపతి: సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మంగళవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభ ఆపార్టీ శ్రేణులను నిరాశపరిచింది.  ఈ సభ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేదనే చెప్పాలి. నిర్ణీత సమయానికి రెండున్నర గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, ఎన్నికల ప్రచారకమిటీ సారధి చిరంజీవి, కేంద్రమంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, జేడీ. శీలం, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు బస్సు యాత్రలో తిరుపతికి వచ్చారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. సాయంత్రం 4 గంటలకు సభ జరగాల్సి ఉన్నప్పటికీ జనం లేకపోవడంతో ఆరున్నర గంటలకు ప్రారంభించారు. సభకు సుమారు రెండువేల మంది హాజరయ్యారని అంచనా వే స్తున్నారు. ఆలస్యం కావడంతో సభ ప్రారంభంలోనే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. ప్రధాన వక్తల్లో చిరంజీవి ప్రసంగం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. అంతో ఇంతో రఘువీరారెడ్డి మెప్పించగలిగారు. ఇద్దరి ప్రసంగాల్లోనూ రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్‌లో సీమాంధ్రలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. వీటితోపాటు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల సొంతజిల్లా కావడంతో వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

అంతేగాకుండా జిల్లాలో ఎంతోకాలంగా పదవులను అనుభవించి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని తిట్టినవారే ఇప్పుడు ఆ పార్టీ పంచన చేరడం పదవీ కాంక్షేనని విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి వారందరినీ ఓడించాలని, కసితో పనిచేయాలని రఘువీరారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభా ప్రాంగణంలో జనం పలుచగా ఉండడంతో రఘువీరారెడ్డి ఇది బహిరంగ సభ కాదని, కార్యకర్తల సమావేశమని చెప్పుకోవాల్సి వచ్చిం ది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం  జరుగుతున్న ఎన్నికల్లో 65 జెడ్పీటీసీ స్థానాలకు 29 మంది, 901 ఎంపీటీసీ స్థానాలకు 60 మంది, 219 వార్డు సభ్యుల పదవులకు 39 మంది కాంగ్రెస్ తరఫున నామినేషన్లు వేశారని పరోక్షంగా పార్టీ దుస్థితిని వివరించారు.

 ప్రముఖులు లేక నిండుదనం కోల్పోయిన వేదిక
 కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన సభలో జిల్లాకు చెందిన ప్రముఖులు లేకపోవడంతో వేదిక నిండుదనం కోల్పోయినట్టు కనిపించింది. ఒకప్పుడు కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ హోదాల్లోని పదవులు పొందిన వారితో కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయింది. జిల్లాకు సంబంధించినంత వరకు తిరుపతి ఎంపీ చింతామోహన్ మినహా ప్రముఖులెవరూ లేరు. డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి కూడా మొన్నటి వరకు జిల్లా అంతటా తెలిసిన నేత కాదు. వేదిక నిండుగా బస్సుయాత్రలో వచ్చిన నేతలే కనిపించారు.   

మరిన్ని వార్తలు