భద్రత ఏదీ?

6 Oct, 2017 13:31 IST|Sakshi

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి ఐడీఏకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అనేక రకాల ఉత్పత్తులు రాష్ట్రానికి అందిస్తున్న ఘనత ఐడీఏ దక్కించుకుంది. పరిశ్రమల్లో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవటం వల్ల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న కొండపల్లిలో ఏపీఐఐసీ ఆ«ధ్వర్యంలో 1984వ సంవత్సరంలో సుమారు 430 ఎకరాల్లో ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో సుమారు 400పరిశ్రమలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 200లోపు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో కెమికల్, ఫార్మా కంపెనీలు సుమారు 30, ఇతర పరిశ్రమలు ఉన్నాయి.

వీటి భద్రతపై కనీసం దృష్టిసారించక పోవటం వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కార్మికులతోపాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో కార్మికులు కాలం వెల్లదీస్తున్నారు. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల్లో అనేకమంది కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుట్టుచప్పుడు కాకుండా క్షతగాత్రుల బంధువులతో రాజీకుదుర్చుకుంటునట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇవి వెలుగు చూడడం లేదు.

జాడ లేని అగ్నిమాపక కేంద్రం
ప్రతియేటా అగ్నిమాపక నివారణ దినోత్సవాలను (సేఫ్టీ వారోత్సవాలు) అట్టహాసంగా నిర్వహించే పరిశ్రమల యజమానులు ప్రమాద నివారణ చర్యలను అమలుచేయడంలో చిత్తశుద్ధిలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లు టర్నోవర్‌ కలిగిన ఐడీఏలో ప్రైవేట్‌ సెక్టార్‌ పరిధిలో అగ్నిమాకదళ కేంద్రం ఉండేది. పరిమిత కాలం ముగియటంతో అగ్నిమాక కేంద్రాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. పదిరోజుల కిందట నిఫ్టీ ల్యాబ్‌కు చెందిన గోడౌన్‌లో నిల్వ ఉంచిన కెమికల్‌ ఉత్పత్తుల డ్రమ్ములకు నిప్పంటుకుని భారీ అగ్నిమాదం సంభవించింది.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక ఎన్టీటీపీఎస్, ల్యాంకో పవర్‌ సంస్థల నుంచి అగ్నిమాక వాహనాలు రావాల్సి వచ్చింది. దీన్ని బట్టి పరిశ్రమ యజమానులు అగ్నిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏ పాటివో తెలుస్తుంది. నిఫ్టీ గోడౌన్‌ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగానే ఆస్తినష్టం చోటుచేసుకుంది. నిఫ్టీలో గతంలో అనేక పర్యాయాలు ప్రమాదాలు జరిగాయి. అయినా యజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కెమికల్‌ కంపెనీల్లో వివిధ రకాల మందుల తయారీలో వినియోగించే బల్క్‌ డ్రగ్స్‌ను డ్రమ్ముల్లో నిల్వచేస్తారు.

 కెమికల్స్‌కు పెట్రోల్‌ మాదిరిగా మండేగుణం కలిగి ఉండటం వల్ల కచ్చితంగా కనీస æభద్రతాపరమైన చర్యలు చేపట్టాలి. భద్రతా ప్రమాణాలు లేనందున ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు. గతంలో కూడా కంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో సమీపంలోని పంట పొలాలకు నష్టం చేకూరటంతోపాటు వ్యర్థజలాలు తాగిన పశువులు మృత్యువాతకు గురయ్యేవి. అప్పట్లో వ్యర్థాల నివారణకు చర్యలు తీసుకోవటంలో అలసత్వం వహించారు.

 స్థానికుల ఆందోళనలతో ఎట్టకేలకు వ్యర్థ పదార్థాల శుద్ధి ప్లాంటు ఏర్పాటుచేశారు. ఆ ప్లాంటు నుంచి వెలువడుతున్న వాయుకాలుష్యం నివారించాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు. కొండపల్లి ఐడీఏలోని పారిశ్రామికవేత్తలు సంపాదన తప్ప ప్రజల శ్రేయస్సుతో పనిలేదని మరోసారి రుజువు చేశారు. భద్రతాపరమైన చర్యలు చేపట్టని కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు