ఏదీ భద్రత!

5 Jan, 2014 05:12 IST|Sakshi

 జిల్లాలో రాత్రీపగలు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఊరెళితే ఇంట్లోని సొమ్ము భద్రంగా ఉంటుందన్న నమ్మకం ప్రజలకు లేకుండా పోయింది. ఏ దొంగ ఇంటికి కన్నం వేస్తాడోనన్న బెంగ పట్టుకుంటోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా అదే భయం. ఏవైపునుంచి ఏ దొంగో వచ్చి మెడలోని గొలుసో, చేతిలోని బ్యాగో కొట్టేస్తాడేమోనని.. పోనీ బ్యాంకుల్లోనైనా సొమ్ము భద్రంగా ఉంటుందని భావించొచ్చా అంటే అదీ లేదు. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు ఏమార్చి కార్డు మార్చి, ఖాతాను ఖాళీ చేసేంతగా దొంగలు తెలివి మీరిపోయారు. దొంగతనాల నివారణకు పోలీసులేమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే.. ఫలితాలేమీ కనిపించడం లేదు. గతేడాది సగటున రోజుకు నాలుగు దొంగతనాలు జరగడం.. సగం సొత్తుకూడా రికవరీ కాకపోవడం పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.
 
 కామారెడ్డి, న్యూస్‌లైన్ :
 గతంలో దొంగలు ఏ అర్ధరాత్రో చోరీలకు పాల్పడేవారు. ఇప్పటి చోరులు తెలివిమీరారు. రాత్రీపగలు తేడా లేకుండా ఏ సమయంలోనైనా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేస్తే ఇల్లు గుల్ల చేస్తున్నారు. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంటే గొలుసులు తెంపుకొని పారిపోతున్నారు. బ్యాంకులోంచి డబ్బులు తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకొని వస్తుంటే.. దానినీ అపహరిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలకూ కన్నాలు వేస్తున్నారు. తెలివిగా ఏటీఎం కార్డులు కొట్టేసి, డబ్బులు దోచేస్తున్నారు.
 
 యథేచ్ఛగా..
 దొంగతనాల నివారణకు పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం తమ పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 2013లో జిల్లాలో 1,490 చోరీలు జరిగాయి. రూ. 4 కోట్లకుపైగా సొత్తు అపహరణకు గురైంది. దొంగతనాల్లో 109 గొలుసు దొంగతనాలున్నాయి. వీటిలో 17 కేసులకు సంబంధించిన సొత్తును మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన కేసుల్లో పురోగతి శూన్యం.
 
 తాళాలు పగులగొట్టి..
 శుభకార్యాలకోసమో.. తీర్థయాత్రల నిమిత్తమో.. ఇత ర పనులపైనో.. ఇంటికి తాళం వేసి వెళ్తేచాలు.. దొం గలు స్పాట్ పెడుతున్నారు. గత నెల 25వ తేదీన నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్-1లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు రూ. 2.30 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అదే నెల 30న జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోయారు. పలు ఇళ్ల తాళాలు పగులగొట్టి, సుమారు 14 తులాల బంగారం, 40 తులాల వెండి, నగదు అపహరించారు. నెల వ్యవధిలో కామారెడ్డి పట్టణంలోని నాలుగు పాఠశాలల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పాఠశాలల్లోని కంప్యూటర్లు, ఫ్యాన్లు, బ్యాటరీలు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు.
 
 గొలుసు దొంగతనాలు
 ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను దొంగలు టార్గెట్ చేసుకుంటున్నారు. సమీపంలో ఎవరూ లేని సమయంలో బైక్‌పై వచ్చి మహిళల మెడలోంచి గొలుసులు తెంపుకొని పారిపోతున్నారు. గత నెల 27న నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్దనున్న ఆలయానికి వచ్చిన దొంగలు.. మహిళా పూజారి మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసు తెంపుకొని పారిపోయారు. అదే నెల 28వ తేదీన నవీపేటలో అంగన్‌వాడీ కార్యకర్త నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన దొంగలు ఆమె మెడలోంచి రెండున్నర తులాల బంగారు ఆభరణాన్ని తెంపుకెళ్లారు. జిల్లాలో ఇలాంటి ఘటనలో గతేడాది 109 జరిగాయి.
 
 క్యాష్ ఉందని తెలిసినా..
 అవసరాల కోసం డబ్బులను తీసుకెళ్తున్నవారిని గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి మండలంలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన కుర్మ చిన్నమల్లయ్య గత నెల 24న కామారెడ్డి పట్టణంలోని ఎస్‌బీహెచ్‌లోంచి రూ. 2 లక్షలు డ్రా చేశారు. ఆ డబ్బులను తీసుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా.. వెనకనుంచి బైక్‌పై వచ్చిన దొంగలు అతడిని మాటల్లో దింపారు. ఎవరూ లేని సమయంలో డబ్బుల సంచి లాక్కొని పరారయ్యారు. అదే మండలంలోని అడ్లూర్ గ్రామానికి చెందిన గాండ్ల పోచవ్వ సైతం ఇలాగే డబ్బులు పోగొట్టుకుంది. ఆమె ఈనెల 2వ తేదీన కామారెడ్డి సంతకు వచ్చింది. పశువులను విక్రయించగా రూ. 50 వేలు వచ్చాయి. ఆ డబ్బులను సంచిలో దాచుకొని వెళ్తుండగా.. దొంగలు బైక్‌పై వచ్చి, మార్గమధ్యలో అటకాయించి సంచిని లాక్కొని పారిపోయారు.
 
 ఏటీఎంలలో..
 డిచ్‌పల్లి, ఎల్లారెడ్డి ఏటీఎంలలో దొంగలు వినియోగదారులను ఏమార్చి, ఏటీఎం డెబిట్ కార్డులు దొంగిలించిన ఉదంతాలున్నాయి. అలా దొంగిలించిన కార్డుల ద్వారా వారి ఖాతాలను ఖాళీ చేసినా.. దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి పాత ఎంజే ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఎస్‌బీహెచ్ ఏటీఎం లోంచి రూ. 500ల నకిలీ నోటు రావడం కలకలం సృష్టించింది.
 
 చిక్కరు.. దొరకరు
 దొంగతనాలు జరిగిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి క్లూస్‌టీంల ద్వారా ఆరా తీస్తున్నా ఫలితం ఉండడం లేదు. పోలీసుల కళ్లు కప్పి దొంగలు రోజుకో ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నారు. అయితే దొంగలు రెచ్చిపోతున్నా.. వారి ఆట కట్టించడంలో పోలీసు శాఖ విఫలమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. అపహరణకు గురైన సొత్తును రికవరీ చేయడంలోనూ వారు విఫలమవుతున్నారు. గతేడాది రూ. 4 కోట్లకుపైగా సొత్తు అపహరణకు గురికాగా రికవరీ చేసింది రూ. 2 కోట్లలోపే కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు