పట్టాలెక్కని పండుగ రైళ్లు

6 Oct, 2018 07:54 IST|Sakshi

రెగ్యులర్‌ రైళ్లకు దసరా తాకిడి

ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్స్‌ ఫుల్‌

ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లే కొనసాగింపు

అదనపు సర్వీసుల ఊసెత్తని రైల్వే శాఖ

దసరా సీజన్‌ మొదలైంది. పండుగకు స్వగ్రామాలకువెళ్లేవారితోపాటు.. సెలవులను సెలబ్రేట్‌ చేసుకునేసందర్శకుల రద్దీ కూడా పెరుగుతోంది. సామాన్యుడిప్రయాణ సాధనమైన రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే
పూర్తి అయ్యి.. ఏ రైలు చూసినా చాంతాడువెయిటింగ్‌ లిస్టులు కనిపిస్తున్నాయి. పండుగలు, సెలవులసీజన్లలో అదనపు సర్వీసులు నడిపే రైల్వే శాఖ ఈసారిఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పండగ సీజన్‌ షురూ అయింది. పాఠశాలలకు దసరా సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. పండక్కి ఊరెళ్దామంటే మధ్య తరగతి ప్రయాణికుడు ప్రయాణించే రైళ్లలో మాత్రం సీట్లు లేవు. తమ తమ ఊళ్లు వెళ్లేందుకు పలువురు ముందుగానే రిజర్వేషన్లు చేసేసుకున్నారు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు, బంధువులు, స్నేహితుల వద్దకు వెళ్లి వస్తుంటారు. వీరంతా పిల్లాపాపలతో కలిసి ప్రయాణించాలంటే విమానయానం కష్టం. టాక్సీల్లో వేలకు వేలు పోసి ప్రయాణించలేరు. పోనీ బస్సుల్లో పోదామా అంటే అత్యధిక చార్జీల వల్ల అదీ సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో సగటు మధ్యతరగతి ప్రయాణికుడికి అందుబాటులో ఉన్న ఏకైక ప్రయాణ సాధనం రైలుబండి. నగర వాసులు ఎక్కువగా ప్రయాణించే హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగుళూరు, హౌరా, భువనేశ్వర్, చెన్నై మొదలగు సిటీలకు రిజర్వేషన్‌ లేకుండా వెళ్లడం ఏమాత్రం సాధ్యం కాదు. ఇక రిజర్వేషన్‌ల సంగతి చూస్తే మాత్రం చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్, రిగ్రెట్, నో రూమ్‌. గోదావరి, విశాఖ, ఫలక్‌నుమా, జన్మభూమి, మెయిల్, కోరమాండల్, కోణార్క్, గరీభ్‌రాథ్, అమరావతి, యశ్వంత్‌పూర్, ప్రశాంతి ఇలా ఏ రైలు చూసినా వందల్లో వెయిటింగ్‌ లిస్ట్, కన్‌ఫర్మ్‌ అవుతుంతో, కాదో తెలియని పరిస్థితి. కొన్ని రైళ్లకు ఇప్పటి నుంచే నో రూమ్‌ వస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో జనరల్‌ బోగీల్లో సగటు పాసింజర్‌ వేలాడుతూ, తొక్కిసలాటల నడుమ ప్రయాణించాల్సి వస్తోంది.

అదనపు రైళ్లు ఏవీ..?
ఒకపక్క పండగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించినా.. ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికే స్పెషల్స్‌గా నడుస్తున్న రైళ్లను మరికొంత కాలం పొడిగించారంతే. ఇంకొన్ని రైళ్లు ఉన్నా.. అవి దువ్వాడ మీద నుంచి ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల విశాఖ వాసులకు నిరాశే ఎదురవుతోంది. ప్రతిరోజు సుమారు 70 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే (ఇటీవలే డీఆర్‌ఎం ప్రకటించారు.) విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను నిర్లక్ష్యం చేస్తే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పలు ప్రత్యేక రైళ్లను అప్పటికప్పుడు ఎటువంటి సమాచారం లేకుండా నడుపుతుండడం వల్ల వాటి సంగతి ప్రయాణికులకు తెలియడం లేదు. దీంతో పలు రైళ్లు ఖాళీగానే వెళ్తున్నాయి. పండగల నేపథ్యంలో అదనంగా వేసే రైళ్లంటూ ఉంటే వాటిని తొందరగా ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

అదనపు రైళ్ల కోసం ప్రపోజల్స్‌..
అదనపు రైళ్ల కోసం ప్రపోజల్స్‌ను పంపించాం. ఇక ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రైళ్లన్నీ పూర్తి కోచ్‌లతో నడుస్తుండడంతో వాటికి అదనపు కోచ్‌లను జతచేయడం కుదరదు. తిరుపతి, సికింద్రాబాద్, యశ్వంత్‌పూర్‌లకు స్పెషల్‌ రైళ్లు వేయవచ్చు.          –జయరాం, పీఆర్‌వో, వాల్తేర్‌ డివిజన్‌

ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్‌ రైళ్లు..
(వాటిలో కొన్ని ప్రత్యేక చార్జీలతో నడిచే తత్కాల్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఉన్నాయి.)
విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08501) – ప్రతి మంగళవారం రాత్రి 11 గంటలకు
విశాఖపట్నం–తిరుపతి(07479) – ప్రతి బుధవారం రాత్రి 7.05 గంటలకు
విశాఖపట్నం–తిరుపతి(08573) – ప్రతి సోమవారం రాత్రి 10.55 గంటలకు
విశాఖపట్నం–తిరుపతి(07488) – ప్రతి సోమవారం రాత్రి 7.30 గంటలకు
విశాఖపట్నం–యశ్వంత్‌పూర్‌ (06580) – ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు
యశ్వంత్‌పూర్‌–విశాఖపట్నం (06579) – ప్రతి శుక్రవారం రాత్రి 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో
సికింద్రాబాద్‌–గౌహతి(07149) – ప్రతి శుక్రవారం రాత్రి విశాఖలో 8.55 గంటలకు
గౌహతి–సికింద్రాబాద్‌(07150) – ప్రతి మంగళవారం సాయంత్రం విశాఖలో 5.35 గంటలకు
సంబల్‌పూర్‌–బాన్స్‌వాడి(08301) – ప్రతి బుధవారం రాత్రి విశాఖలో 7.20 గంటలకు
బాన్స్‌వాడి–సంబల్‌పూర్‌(08302) – ప్రతి శుక్రవారం రాత్రి విశాఖలో 8.35 గంటలకు
కాచిగూడ–విశాఖపట్నం(07016) – కాచిగూడలో ప్రతి మంగళవారం రాత్రి 6.45 గంటలకు

మరిన్ని వార్తలు