గాడి తప్పుతున్న గ్రంథాలయాలు

19 Nov, 2013 06:26 IST|Sakshi

వెంకటగిరి, న్యూస్‌లైన్ : విజ్ఞాన గనులుగా విరాజిల్లిన గ్రంథాలయాలు నానాటికి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి ఏటా గ్రంథాలయాల ప్రాముఖ్యతను, ఖ్యాతిని కీర్తిస్తూ వారోత్సవాలు నిర్వహించడం తప్ప వాటి ప్రగతికి ప్రణాళిక రూపొందించిన దాఖలాలు లేవు. అరకొర వసతులు కలిసిగిన శిథిల భవనాల్లో, చెదలుపట్టిన గ్రంథాలతో వ్యవస్థను నడిపిస్తూ మమ అనిపిస్తున్నారు. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీకాక, ఉన్న ఉద్యోగులు పదవీ విరమణతో అనేక గ్రంథాలయాలు మూతపడుతున్నాయి. అనేక ప్రధాన గ్రంథాయాలను సైతం ఇన్‌చార్జిల పాలనలోనే నడిపిస్తున్నారు.

జిల్లాలోని నెల్లూరు నగరం, గూడూరు, కావలి ప్రధాన పట్టణాల్లో గ్రేడ్-1 గ్రంథాలయాలు ఉండగా, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, రాపూరు, కోవూరులో ద్వితీయశ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో, పట్టణాల్లో మొత్తం 65 గ్రంథాలయాలు ఉండగా, అందులో 58 శాఖాగ్రంథాలయాలు ఉన్నాయి. 7 గ్రామీణ గ్రంథాలయాలు పాఠకులకు సేవలు అందిస్తున్నాయి. గ్రంథాలయాలు పాఠకులకు అందుబాటులో ఉంటూ వారికి విజ్ఞానం అందించడంలో ప్రధాన భూమిక నిర్వహించాల్సి ఉంది. జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో కనీస వసతుల సైత్యం మృగ్యమయ్యాయి. సొంత భవనాలు లేని గ్రంథాలయాలు అనేకం ఉన్నాయి.

ఎన్నోఏళ్లుగా సొంత భవనాలు కోసం ప్రతిపాదనలు పంపడమే తప్ప అవి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. గ్రంథాలయాలకు నిధులు సక్రమంగా కేటాయించకపోవడం, విడుదల చేయకపోవడంతో కొత్త గ్రంథాల కొనుగోలు కానీ, పత్రికలు, ఉద్యోగ, విద్యా సంబంధిత పుస్తకాల కొనుగోలు ఎప్పుడో నిలిచిపోయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఆయా గ్రంథాలయాలకు కేటాయించిన పుస్తకాలు మినహా కొత్త పుస్తకాలే లేవు. జిల్లాలోని 46 మండలాలు, మునిసిపాలిటీల నుంచి సుమారు రూ.4 కోట్ల మేర సెస్ బకాయిలు జిల్లా గ్రంథాలయ సంస్థకు రావాల్సి ఉంది. కనీసం ఈ బకాయిలను వసూలు చేస్తే జిల్లాలోని గ్రంథాలయాలన్నిటికీ పుష్కలంగా కొత్త గ్రంథాలు కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో నూతన పరిజ్ఞానం, వసతులు కల్పించాల్సి అవసరం ఉంది. శాస్త్రసాంకేతిక రంగాలతో పాటు సమాచారం అందించే గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందితే పాఠకులకు ఎంతో ఉపకరిస్తుంది. అయితే పాలకులు మాత్రం ఆ తరహాలో దృష్టి సారించకపోవడంతో గ్రంథాలయంలోని వసతులు మెరుగు పడకపోగా ఖాళీ అయిన పోస్టులు సైతం భర్తీ కావడం లేదు. జిల్లాలో గ్రేడ్-1 గ్రంథ పాలకులు రెండు, గ్రేడ్-2 పాలకులు మూడు, గ్రేడ్-3 గ్రంథపాలకులు -8, అటెండర్లు 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   
 

మరిన్ని వార్తలు