ఆర్టీసీ సమ్మె లేనట్లే...

11 Sep, 2014 01:33 IST|Sakshi

* ఎంప్లాయీస్ యూనియన్‌తో యాజమాన్యం చర్చలు సఫలం
* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధ్యయన కమిటీ..
* ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి నివేదిక
* సీసీఎస్‌కు రూ.130 కోట్లు.. జూలై నుంచి కొత్త డీఏకి 50 కోట్లు
* దసరా అడ్వాన్స్‌కు రూ. 30 కోట్లు
 
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తలపెట్టిన ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెను ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విరమించింది. బుధవారం ఈయూ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇక్కడి బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కె.పద్మాకర్, పి.దామోదర్‌రావు, హన్మంతరావు, రాజేంద్రప్రసాద్, ప్రసాదరెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.

కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని, గత నెల 2న ఇచ్చిన సమ్మె నోటీసులో  పేర్కొన్న డిమాండ్లపై సానుకూలంగా స్పందిం చినందున సమ్మెను విరమిస్తున్నట్లు ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కె.పద్మాకర్, దామోదర్‌రావులు ప్రకటించారు. సమ్మె నోటీసు ఒప్పందం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లో ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తాము పెట్టిన 11 డిమాండ్లు అమలు చేస్తామని యాజ మాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె యోచన విరమించినట్టు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు విజయవాడలో చెప్పారు. యాజమాన్యంతో ఈయూ నేతల చర్చల అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విజ యవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా మూడు రోజులు దీక్షలు చేపట్టామన్నారు. అయినా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోవడం తో 40 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చామన్నారు.

 యూనియన్ నేతల వివరాల ప్రకారం యాజమాన్యం ఒప్పుకున్న ముఖ్య డిమాండ్లు..
* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై అధ్యయన కమిటీ. ఈ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి కమిటీ నివేదిక
* ఏపీలో ఆర్టీసీ రుణాల కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు వెంటనే చెల్లింపునకు అంగీకారం. ఆగస్టు 31 వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలకు, పదవీ విరమణ చేసిన వారి సెటిల్‌మెంటుకు రూ.130 కోట్లు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) కింద చెల్లించేందుకు సుముఖత
* ఈ నెలలో దసరా అడ్వాన్స్ ఇచ్చేందుకు రూ.30 కోట్లు మంజూరు
* కార్మికులకు 5.5 శాతం కొత్త డీఏ ఈ ఏడాది జూలై నుంచి అమలు. అక్టోబరు నెల నుంచి చెల్లింపు. రూ. 50 కోట్లు మంజూరు
* పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రొడక్షన్ యూనిట్లకు కొత్త మేన్ అవర్ రేట్ వచ్చే నెల నుంచి అమలు
* టి.ఆర్.ఎస్. కార్మికుల బకాయిలు ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నెలల్లో రెండు వాయిదాల్లో చెల్లింపు
* డీఏ బకాయిలు, ఆర్జిత సెలవును  సమీక్షించి, ప్రకటన చేయడానికి అంగీకారం
* కారుణ్య నియామకాలు, ఉద్యోగాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై సర్క్యులర్
* పల్లె వెలుగు బస్సులకు సింగిల్ డోర్ ఏర్పాటుపై యాజమాన్యం సానుకూల స్పందన
* అలవెన్సులు, సర్వీసు కండిషన్లపై ఈ నెల 20న పే కమిటీకి రిపోర్టు ఇచ్చిన వెంటనే అమలు
* ఆగస్టు 2న ఇచ్చిన సమ్మె నోటీసులో పొందుపరిచిన ఇతర డిమాండ్లపై యాజమాన్యం లిఖితపూర్వక హామీ
 
ఈయూ మరోసారి కార్మిక ద్రోహం చేసింది: ఎన్‌ఎంయూ
కార్మికుల ప్రధాన అంశమైన వేతన సవరణను పక్కన పెట్టి ఇతర అంశాల పేరుతో సమ్మె చేస్తామని చెప్తూ వచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ మరోసారి కార్మికులకు  ద్రోహం చేసిందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) అధ్యక్షుడు నాగేశ్వరరావు ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇటీవలి కాలంలో ఐదుసార్లు సమ్మె పేరుతో కార్మికులను ఈయూ మభ్య పెట్టిందని ఆరోపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా