‘ఆకాశ్’మంత అలక్ష్యం !

3 Oct, 2013 05:12 IST|Sakshi
‘ఆకాశ్’మంత అలక్ష్యం !

నూగూరి మహేందర్ (సాక్షి, హైదరాబాద్): భారత అమ్ముల పొదిలో ప్రముఖ అస్త్రమైన ఆకాశ్ క్షిపణుల సరఫరా సాఫీగా జరిగే అవకాశాలు కనపడటం లేదు. క్షిపణుల తయారీ బాధ్యత స్వీకరించిన హైదరాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థ బీడీఎల్ క్షిపణుల తయారీకి కావాల్సిన విడిభాగాల కొనుగోలు కోసం కొత్తగా 100 చిన్న కంపెనీలను (వెండర్‌‌స) ఎంపిక చేసుకున్నా ఇప్పటివరకు వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు. కాంట్రాక్టు మేరకు క్షిపణులు తయారుచేసి అందజేయకుండా పాత వెండార్లతోనే సర్దుకుపోతోంది. గత మూడేళ్లుగా బీడీఎల్ అధికారుల్లో చలనం లేకపోవడం రక్షణశాఖకు ఆందోళన కలిగిస్తోంది.
 
 ఆకాశ్ క్షిపణిని డీఆర్‌డీవో, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ, భారత్ ఎలక్ట్రానిక్స్‌లు సంయుక్తంగా 20 ఏళ్లపాటు శ్రమించి సొంతగా అభివృద్ధి చేశాయి.  ఉపరితలం నుంచి ఆకాశంలోకి ఈ క్షిపణిని ప్రయోగిస్తారు. 60 కేజీల వార్‌హెడ్‌ను ఇది మోసుకుపోగలదు. 30 కిలోమీటర్ల పరిధిలో మానవ రహిత విమానాలు, యుద్ధ విమానాలు, క్షిపణులను గుర్తించి కూల్చివేయగలదు. ఈ నేపథ్యంలో 2010లో సైనిక దళం 2,000 క్షిపణులకు, 2011లో వైమానిక దళం 1,000 క్షిపణుల తయారీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు ఆర్డరు ఇచ్చాయి. ఈ రెండింటి విలువ సుమారు రూ.26,500 కోట్లు. అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని కూడా బీడీఎల్ తీసుకుంది.
 
 కొత్త కంపెనీలను ఆహ్వానించిన బీడీఎల్
 భారీ కాంట్రాక్టు దృష్ట్యా విడిభాగాల కొనుగోలుకు ఇప్పటివరకు తమకున్న కంపెనీలు సరిపోవని బీడీఎల్ భావించింది. మరిన్ని కంపెనీల కోసం 2010లో ఆసక్తి వ్యక్తీకరణను కోరింది. 300 పైగా కంపెనీలు ముందుకొచ్చినా దరఖాస్తుల పరిశీలన అనంతరం 100 కంపెనీలను ఎంపిక చేసింది. సుమారు రూ.5 వేల కోట్ల విలువైన పనులు కొన్నేళ్లపాటు తమకు లభిస్తాయని ఆయా కంపెనీలు ఆశించాయి. ఆ మేరకు కొన్ని కంపెనీలు రుణాలు తీసుకుని మరీ ప్లాంట్ల విస్తరణ చేపట్టాయి. రాష్ట్రానికే చెందిన ప్రముఖ పెట్టుబడిదారు ఒకరు బీడీఎల్ ఆర్డరుపై ఆశతో ఏకంగా కంపెనీనే స్థాపించారు.
 
 అయితే మూడేళ్లు కావస్తున్నా బీడీఎల్ ఇంతవరకు ఎంపికచేసిన కంపెనీలకు పనులు అప్పగించలేదు. పాత కంపెనీలు బీడీఎల్‌పై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆర్డర్లలో జాప్యంపై బీడీఎల్‌ను సంప్రదిస్తే కంపెనీల ఎంపిక బాధ్యత తమది కాదంటూ డీఆర్‌డీవోపై నెపం వేస్తోందని ముంబయికి చెందిన ప్రముఖ కంపెనీ ఏరోస్పేస్ విభాగం హెడ్ సాక్షి ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి అవినీతి కారణమై ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలను పక్కకునెట్టి పాత కంపెనీల ఒత్తిడికి తలొగ్గారని ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ ప్రతినిధి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ప్రజా రవాణా ప్రాజెక్టు చేపడుతున్న ఓ సంస్థే ఇదంతా నడిపిస్తోందని అన్నారు.  
 
 500 మిస్సైళ్లు కూడా అప్పగించలేదు..
 కాంట్రాక్టులో భాగంగా బీడీఎల్ ఏటా 500 క్షిపణులను సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి 500 క్షిపణులు కూడా సరఫరా చేయలేదని విశ్వసనీయ సమాచారం. ‘రెండు దశాబ్దాలు శ్రమకోర్చి భారతావని గర్వపడేలా ఆకాశ్‌ను డిజైన్ చేశాం. అలాంటి క్షిపణి తయారీలో బీడీఎల్ తీరు ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా హెచ్చరిస్తున్నాం. గడువులోగా క్షిపణులను సరఫరా చేయాలని పదేపదే చెబుతున్నా వారిలో మార్పు రావడం లేదు’ అని డీఆర్‌డీవో అధికారి ఒకరు అసహనం వ్యక్తం చేశారు. బీడీఎల్ చేతులెత్తేస్తే రక్షణశాఖ విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇదెంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారమైనందున కరంటు ఖాతా లోటు మరింత పెరగడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
 
 కొత్త కంపెనీలను తీసుకుంటాం..
 ఆకాశ్ క్షిపణులను ఎన్ని సరఫరా చేశారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ బీడీఎల్ ఈడీ మాధవరావును సంప్రదించింది. అయితే ఆ వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు. కొత్త కంపెనీల జాబితా ఇంకా ఖరారు కాలేదని త్వరలో వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు.

>
మరిన్ని వార్తలు