ప్రచార హోరు.. పన్ను కట్టరు! 

28 Nov, 2019 10:31 IST|Sakshi

నగరపాలక సంస్థలో ప్రకటనల స్కాం 

ప్రధాన కూడళ్లలో ఇబ్బడిముబ్బడిగా బోర్డులు 

పన్ను చెల్లింపుల్లో యాడ్‌ ఏజెన్సీల నిర్లక్ష్యం

టీడీపీ హయాంలో దోపిడీ పర్వం 

స్థానిక సంస్థలు ఆర్థికంగా బలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందువల్లే పాలక వర్గాలు నిరంతరం ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తుంటాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అయితే అక్కడున్న హోర్డింగ్‌లు, సైన్‌బోర్డులు తదితరాలపై ప్రచార పన్ను పేరుతో ప్రతి నెలా రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు. కానీ అనంతపురం నగరపాలక సంస్థ గత పాలకవర్గం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. పన్నుల రూపంలో ఖజానాకు చేరాల్సిన డబ్బుకు కన్నం వేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన డబ్బును తమ అనుయాయులకు దోచిపెట్టింది. ఫలితంగా అనుకున్న మేర అభివృద్ధి జరగక నగరవాసులు అల్లాడిపోయారు.

సాక్షి, అనంతపురం: నగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగ్‌లు, బోర్డులు కనిపిస్తుంటాయి. వాటిపై అడ్వర్‌టైజ్‌మెంట్లు కళకళలాడుతుంటాయి. కానీ నగరపాలక సంస్థకు చెందాల్సిన ప్రచార పన్ను అందకపోగా ఖజానా వెలవెలబోతుంటుంది. టీడీపీ హయాంలో ఐదేళ్లూ ప్రచార పన్నుకు భారీగా కన్నం వేసినట్లు తెలుస్తోంది. యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకులకు అధికారులు, అప్పటి పాలక వర్గంలోని నేతలు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏటా జనాభాకు అనుగుణంగా పన్ను పెంచాల్సి ఉన్నా.. గత పాలక వర్గం ఐదేళ్లూ ఎలాంటి మార్పు చేయకపోవడంతో నగరపాలక సంస్థ ఖజానాకు చేరాల్సిన రూ.లక్షల ఆదాయం ఇతరుల జేబుల్లోకి వెళ్లిపోయింది. 

పేరుకే గెజిట్‌.. వసూళ్లు నామమాత్రం 
నగరపాలక సంస్థ పరిధిలో ప్రకటనల బోర్డులపై ఏటా లైసెన్స్‌డ్‌ యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకులు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. టీడీపీ హయాంలో నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన ఐదు నెలల తర్వాత ప్రచార పన్ను చెల్లింపునకు గెజిట్‌ తయారు చేసి, కౌన్సిల్‌ అనుమతులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక చదరపు మీటరు వైశాల్యం గల స్థలంలో దీపాలు అమర్చకుండా ఏర్పాటు చేసే ప్రకటనకు రూ.500, ఒక చదరానికి మించితే రూ.800, ఇలా ప్రతి అదనపు 2.50 చదరపు మీటరుకు రూ.800 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే 5 చదరపు మీటర్లకు రూ.2,800 వసూలు చేయాలని గెజిట్‌లో పొందుపరిచారు.

ఇక 5 చదరపు మీటర్ల స్థలంలో దీపాలు అమర్చిన వాహనాలపై బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తే బోర్డుకు రూ.5 వేలు, 0.50 చదరపు మీటర్ల స్థలంలో తెరపైన ల్యాండర్న్‌ స్లైడ్స్‌ ప్రకటనలకు(పబ్లిక్‌ప్లేస్‌) రూ.2 వేలు, 0.50 చదరపు మీటర్ల నుంచి 2.50 చదరపు మీటర్లకు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సినిమా హాల్‌లో స్లైడ్స్‌కు(కలర్, కలర్‌ లేనివి) రూ.1,300, షార్డు(ట్రైలర్‌ ఫిలిం సహా 150మీ) రూ.4,000, షార్టు ట్రైలర్‌ ఫిలిం 150 మీటర్ల నుంచి 300 వరకు రూ.9 వేలు చెల్లించాలని గెజిట్‌లో పేర్కొన్నారు. కానీ పన్ను వసూళ్లపై కనీస దృష్టి సారించలేదు. 

వేల పాట రద్దు చేసి మరీ.. 
నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రచారానికి హోర్డింగ్‌లు, బోర్డుల ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగల వారిని ఆహా్వనించి వేలంపాట నిర్వహిస్తారు. కానీ టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు వేలంపాటను పూర్తిగా రద్దు చేశారు. 

అనధికార హోర్డింగ్‌లే ఎక్కువ 
నగరంలో 20 యాడ్‌ ఏజెన్సీలుండగా ఆయా ఏజెన్సీల పరిధిలో 258 బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అనధికారికంగా మరో 10 ఏజెన్సీలు నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండానే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరో 250 హోర్డింగ్‌లు అనధికారికంగా వేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా రూ.లక్షల్లో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ప్రస్తుతం నగరపాలక సంస్థలో కొన్ని యాడ్‌ ఏజెన్సీల నిర్వాహకులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కుమ్మక్కయ్యారు. రూ.వేలల్లో మామూళ్లిచ్చి రూ.లక్షల్లో పన్ను ఎగ్గొడుతున్నారు.  

అక్రమాలకు అందలం 
టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఓ టీపీఓ  (కీలక అధికారి), మరో ఇద్దరు టీపీఎస్‌ల నిర్వాకంతోనే ఈ అక్రమ బాగోతం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో యాడ్‌ ఏజెన్సీ విధానాన్ని వేలం పాటలో నిర్వహించకుండా వివిధ కమర్షియల్‌ ప్రాంతాలకు టీపీఎస్‌లే పంచుకున్నారు. వారి పరిధిలోనే యాడ్‌ ఏజెన్సీ నిర్వహణ జరిగేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గత పాలకులు, అధికారులు మీకు..మాకు అన్న ధోరణిలో నగరపాలక సంస్థ ఆదాయానికి గండికొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే సదరు కీలక అధికారి, టీపీఎస్‌లు వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లగా వారు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. 

పన్ను చెల్లింపు రికార్డులు మాయం 
ప్రచార పన్నులకు సంబంధించిన రికార్డులు గల్లంతయినట్లు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటనల పన్ను చెల్లింపులకు సంబంధించిన రికార్డులేవీ లేవని చెబుతున్నారు. ఆ రికార్డులు బయటకు వస్తే ఎంత వసూలు చేశారు...ఎంత మేశారో తెలిసిపోతుందన్న భయంతోనే కొందరు ఇంటిదొంగలే ఆ రికార్డులను మాయం చేసినట్లు తెలుస్తోంది.  

కమిషనర్‌ ఆరా 
కమిషనర్‌ పి.ప్రశాంతి పది రోజుల కిందట నగరంలో వేసిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బోర్డులకు సంబంధించి పన్నులు ఏ విధంగా వసూలు చేస్తున్నారని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను అడిగినట్లు తెల్సింది. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ముగిసిన వెంటనే దీనిపై లోతుగా ఆరా తీస్తానని, ఆలోపు ప్రకటనల పన్ను ఫైలు సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. 

పన్ను చెల్లించని వారిపై చర్యలు 
నేను ఈ ఏడాదే ఏసీపీగా ‘అనంత’కు వచ్చాను. యాడ్‌ ఏజెన్సీ ప్రకటనల పన్ను విషయం గురించి ఆరా తీస్తున్నా. ఇటీవల కమిషనర్‌ మేడం కూడా పన్నులు సక్రమంగా వసూలు చేయాలని చెప్పారు. ప్రకటన పన్నులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నాం. ఎవరైనా పన్ను చెల్లించకుండా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం.  – సుబ్బారావు, ఏసీపీ    

  • టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలతో తిరుపతికి చెందిన ఓ యాడ్‌ ఏజెన్సీ నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, డివైడర్ల మధ్యలో స్లైడ్స్, లాలిపాప్స్‌ అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ప్రకటన పన్ను మాత్రం సక్రమంగా చెల్లించలేదు. అయినా అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి సీఎం, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి జిల్లాకు వచ్చినప్పుడు టీడీపీ నాయకుల ప్రకటనలకు డబ్బు తీసుకోలేదనే కారణంతో నగరపాలక సంస్థ పాలక వర్గం ఆ ఏజెన్సీకి అనధికారికంగా పన్ను మినహాయించింది.
  • నగరంలోని సర్వజనాస్పత్రి, సప్తగిరి సర్కిల్‌ ముందు ఓ యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు బోర్డులు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు వెళ్లిన సిబ్బందిని దబాయించాడు. పాలకవర్గం అండదండలతో పన్ను చెల్లించకుండా రెండేళ్ల పాటు యాడ్స్‌ వేసుకుని   రూ.లక్షలు సంపాదించాడు.
మరిన్ని వార్తలు