నిబంధనలకు టెండర్!

13 Dec, 2013 03:49 IST|Sakshi
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఈ ఏడాది మే 17న బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వర్సిటీలో చేపడుతున్న నిర్మాణ పనుల ను టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. ఎచ్చెర్లకు చెందిన జరుగుళ్ల కృష్ణమూర్తి, శ్రీకాకుళానికి చెందిన పైడి నిర్మల్‌కుమార్‌లకే వీటిని కట్టబెడుతుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు అవసరమైతే పనులను ముక్కలు చేస్తున్నారు తప్ప టెండర్లు పిలవటం లేదు.
 
 ఇదీ పనుల పరిస్థితి
 పార్కింగ్ షెడ్, ఆంధ్రాబ్యాంకు పక్క గేటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గేటును రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పార్కింగ్ షెడ్ ను వీసీ లజపతిరాయ్ ప్రారంభించారు. ప్రారంభ శిలాఫలకాలపై అంచనా వ్యయమెంతో రాయటం లేదు. అంచనాల్లో తరచూ మార్పులు చోటు చేసుకోవటమే దీనికి కారణమని సమాచారం. మహిళా వసతిగృహంపై అదనపు గదుల నిర్మాణ పనులను నాలుగు భాగాలుగా విభజించి ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇంత భారీ పనికి టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తే పనులు వేగంగా పూర్తవుతాయని ముక్కలు చేసి అప్పగించామని అధికారులు కథలు చెబుతున్నారు. సీసీ రోడ్డు, ఎగ్జామినేషన్ గోదాం, మహిళా వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
 
 నాణ్యతపై సందేహాలు
 మరోపక్క నిర్మాణ పనుల్లో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ అధికారిగా విశ్రాంత ఇంజినీర్ పని చేస్తుండటంతో జవాబుదారీతనం ఉండటం లేదని పలువురు అంటున్నారు. సిమెంటు, ఇసుకలను సరైన నిష్పత్తిలో వాడటం లేదని, శ్లాబు నిర్మాణానికి పీపీసీ బదులు ఓపీసీ సిమెంటు వాడుతున్నారని, వాటరింగ్ సరిగా చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి. పనుల నాణ్యతపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవటంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని అంటున్నారు.
 
 పర్సంటేజీలే కారణం?
 టెండర్ల ద్వారా ఇచ్చే పనులకు వచ్చే పర్సంటేజీ కన్నా నామినేటెడ్ పనులకు ఎక్కువ పర్సంటేజీ వస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని వర్సిటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పద్ధతిలో పనులు ఇస్తే 28 శాతం (కాంటాక్టర్‌కు 40 శాతం మిగిలే అవకాశం ఉందట), టెండర్ల ద్వారా ఇస్తే 14 శాతం(కాంట్రాక్టర్‌కు 20 శాతం మిగిలే అవకాశం ఉందట) సొమ్ము వస్తుందని అంటున్నారు. మరోవైపు.. వర్సిటీ ఇంజినీరింగ్ అధికారి కూడా పనుల్లో పరోక్షంగా పెట్టుబడి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే పరిస్థితి మరింత దారితప్పే అవకాశం ఉందని వర్సిటీ శ్రేయోభిలాషులు అంటున్నారు.
 
 నిబంధలకు లోబడే చేస్తున్నాం..
 ఈ విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇప్పటివరకు అత్యవసర పనులను మాత్రమే చేయించామని, ప్రతి పనికీ విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, ఆభివృద్ధి మండలి అనుమతులు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని పనులు నిబంధనలకు లోబడే చేస్తున్నామని, ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోవటం లేదన్నారు. త్వరలో రూ.18 లక్షలతో నిర్మించనున్న భవనాల పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు.
 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా