నో..‘టెన్’షన్

16 Jul, 2014 00:13 IST|Sakshi
నో..‘టెన్’షన్

గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పాత విధానంలోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నూతనంగా ప్రవేశపెట్టేందుకు నిర్ణయించిన తొమ్మిది పేపర్ల విధానాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసి, వచ్చే విద్యా సంవత్సరంలో అమలు పర్చాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మారిన టెన్త్ సిలబస్‌పై ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడం, నూతన పరీక్ష విధానానికి విద్యార్థులు సన్నద్ధం కాలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
 జాతీయ స్థాయి విద్యా విధానాన్ని అనుసరిస్తూ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈఆర్‌టీ) పదవ తరగతి పాఠ్యాంశాల్లో సమూల మార్పులు చేసింది.
 
 దీనిలో భాగంగా పబ్లిక్ పరీక్షల విధానంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయని పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులకు ముందు ప్రకటిస్తూ వచ్చింది.
 
 ఇప్పటి వరకూ 11 పేపర్లతో పదో తరగతి పరీక్షలను నిర్వహించగా, కొత్త విధానంలో తొమ్మిది పేపర్లతో పరీక్ష నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చేసిన ప్రకటనలు ఇటు తల్లిదండ్రులు, అటు అధికారులను సైతం అయోమయానికి గురి చేశాయి.
 
 30, 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి సిలబస్‌లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించడంలో విఫలమైంది.
 
 పాఠశాలలు తెరిచిన తరువాత టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కల్పించి చేతులు దులుపుకున్న పాఠశాల విద్యాశాఖ కొత్త విధానంలోనే పరీక్షలు జరుగుతాయని హడావుడిగా ప్రకటిం చేసింది.
 
 అయితే నూతన విధానంలో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా అనే అంశం పరిశీలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఇది అసాధ్యమని తేలింది.
 
 అంతేకాక పదో తరగతిలో కొత్త పరీక్ష విధానం ప్రైవేట్‌విద్యార్థులకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని గుర్తించారు.
 
 ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానంతో ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులపై వేటు పడనుంది. - రెగ్యులర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానంలో 20 మార్కులను నిర్ణయించాల్సి ఉండగా, ప్రైవేటు విద్యార్థులకు అలాంటి అవకాశమే ఉండదని తేలింది.
 
 స్పష్టమైన  నిర్ణయం వెలువడాల్సి ఉంది..
 పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కొత్త విధానమా, లేక పాత పద్ధతిలోనా అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకూ దీనిపై ఉపాధ్యాయులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
 - డి. ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి
 

>
మరిన్ని వార్తలు