బుక్కుల్లేవ్.. పాఠాల్లేవ్!

11 Jul, 2015 04:20 IST|Sakshi
బుక్కుల్లేవ్.. పాఠాల్లేవ్!

♦ ఇంటర్ విద్యార్థులకు అరకొరగా పుస్తకాలు
♦ ఒకేషనల్ పుస్తకాలు అసలే లేవు
♦ ఎదురుచూస్తున్న విద్యార్థులు
 
 ప్రయివేటు కాలేజీలకు దీటుగా విద్య అందిస్తామన్నారు.. ఫలితాల విషయంలో పోటీ పడతామన్నారు.. ఆచరణకు వచ్చేసరికి షరామామూలే. జూనియర్ కాలేజీలు ప్రారంభమై నెల గడిచిపోయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలే అందించలేని అధికారులు ఫలితాల సాధనలో లక్ష్యాలెలా సాధిస్తారో వేచి చూడాల్సిందే.
 
  కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇంటర్ ఉచిత పుస్తకాలు కొంతమందికే అందాయి. సాధారణ కోర్సుల్లో తెలుగు మీడియం పుస్తకాలు అరకొరగా రాగా ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు రానేలేదు. కళాశాలలు గత నెల 8వతేదీ ప్రారంభమయ్యాయి. నెల రోజులు గడిచినా పుస్తకాలు అందక పోవడంతో విద్యార్థులు వాటికోసం ఎదురుచూస్తుండగా వస్తాయంటూ అధికారులు పొద్దెళ్లబుచ్చుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 ప్రభుత్వ, 10 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, వాటికి అనుబంధంగా 14 కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులున్నాయి. ఈ ఏడాది ఎప్పుడు లేనివిధంగా ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కళాశాలలు ప్రారంభమయ్యేనాటికే పుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆచరణలో మాత్రం అలాంటి చర్యలేవీ కనిపించలేదు.

 ఒకేషనల్‌కు 3 టైటిల్సే పంపిణీ
 ఒకేషనల్ కోర్సులో ఏఅండ్‌టీ, ఓఏ, సీఎస్‌ఈ, ఈఈటీ, సీజీటీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), సీటీ, ఏఈటీ, సీజీటీ, ఈటీ, సెరికల్చరర్ విభాగాలున్నాయి. ప్రతి విభాగానికి ఇంగ్లీషు కామన్‌గా ఉంటుంది. ఇందులో రెండో సంవత్సరానికి సంబంధించి ఇంగ్లీషు, ఏఅండ్‌టీ, ఓఏ విభాగాల్లోని కామర్స్ పాఠ్య పుస్తకాలను మాత్రమే పంపిణీ చేశారు. మొదటి సంవత్సరానికి సంబంధించి కామర్స్ పాఠ్యపుస్తకం మాత్రమే వచ్చింది.

 అరకొరగా తెలుగు మీడియం పుస్తకాలు
 ఫస్టియర్‌కు సంబంధించి 22 టైటిల్స్‌కుగాను 13 టైటిల్స్ పుస్తకాలే వచ్చాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు మొత్తం 19,779 పుస్తకాలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 15,144 మాత్రమే వచ్చాయి. సెకండియర్‌కు సంబంధించి 22 టైటిల్స్‌కుగాను 15 టైటిల్స్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా రెండో సంవత్సరం విద్యార్థులకు 32,935 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 23,933 పుస్తకాలు మాత్రమే మిగిలిన 9002 పుస్తకాల్లో కూడా తెలుగు మీడియం పుస్తకాలే అధికంగా రావాల్సి ఉంది.

  రావాల్సిన పుస్తకాల వివరాలు
 మొదటి సంవత్సరానికి సంబంధించి హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, జువాలజీ,  బాటనీ, రెండో సంవత్సరానికి సంబంధించి తెలుగు, జువాలజీ, సంస్కృతం, సివిక్స్, మ్యాథ్స్2ఏ, కెమి స్ట్రీ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది.
 
 రెండు రోజుల్లో వస్తాయన్నారు
 రెండు, మూడు రోజుల్లో పుస్తకాలు వస్తాయనే సమాచారం ఉంది. ఇప్పటి వరకు సెకండియర్‌కు సంబంధించి ఇంగ్లీషు, కామర్స్ పుస్తకాలు ఇచ్చాయి. ఫస్టియర్‌లో  కామర్స్ పుస్తకాలను మాత్రమే ఇచ్చాం. మిగతా పుస్తకాలు రాగానే ఇస్తాం.
 - గాంధీ, ప్రిన్సిపాల్, ఒకేషనల్ కాలేజీ, కర్నూలు
 
 జనరల్ కోర్సులకు సంబంధించిన పుస్తకాలే వస్తున్నాయి
 ఇంటర్ ఉచిత పుస్తకాలు జనరల్ కోర్సులకు సంబంధించే వస్తున్నాయి. వాటిని ఇప్పటికే పంపించేశాం. ఒకేషనల్‌లో అకౌంట్స్‌కు సంబంధించిన పుస్తకాలు మాత్రమే వచ్చాయి. మిగతావి రాగానే కాలేజీలకు పంపిస్తాం.
 వెంకటరావు, డీవీఈఓ, కర్నూలు

మరిన్ని వార్తలు