రూ.100 కోట్లు ఉన్నా ఏం లాభం?

13 Sep, 2014 01:12 IST|Sakshi
రూ.100 కోట్లు ఉన్నా ఏం లాభం?

రూ.100 కోట్లు... ఇది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న నిధుల మొత్తం.  ఈ సొమ్ముతో రోడ్లు, తాగునీరు,సాగునీరు, ఇళ్ల నిర్మాణాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చు.   అయితే సర్కార్ ఆంక్షలతో ఈ సొమ్ము  ఇప్పుడు ఎందుకూ అక్కరకు రాకుండా పోతోంది. నిరుపయోగంగా ఖజానాలో మూలుగుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకపోగా, గతంలో మంజూరైన వాటిపైనా ఆంక్షలు విధించడంతో జిల్లా వాసులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అమ్మ పెట్టదు... అన్న చందంగా   ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వకపోగా గత ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులను సైతం ఖర్చు పెట్టనివ్వకుండా అడ్డుకుంటోంది. దీంతో ఎక్కడికక్కడ అభివృద్ధి స్తంభించిపోతోంది. ప్రగతి కుంటుపడిపోయింది. ఆధార్ అని, సర్వేలనీ కబుర్లు చెప్పడం తప్ప జనాలకు చేసిందేమీ కన్పించడం లేదు.  
 
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు తమ నియోజకవర్గాల్లో  అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ) పథకాన్ని ప్రతీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.కోటి చొప్పున కేటాయిస్తారు.   ఇందులో ఎమ్మెల్యే కోటా కింద రూ.50 లక్షలు, ఇన్‌చార్జ్ మంత్రి కోటా కింద రూ.50 లక్షలు విడుదల చేసేవారు.  ఈ నిధులు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడేవి. అయితే, ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి  ఆ భాగ్యం లేకుండా పోయింది.
 
నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ ఏడాది నిధులొచ్చే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పనులను ప్రతిపాదించలేని పరిస్థితి దాపురించింది. వారిపై ఆశలు పెట్టుకున్న ప్రజలు పరిస్థితి దయనీయంగా తయారైంది. అధికారంలోకి వచ్చిన టీడీపీ  నిధులివ్వకపోగా గత ప్రభుత్వ హయాంలో విడుదలైన నిధులపైనా ఆంక్షలు పెట్టింది. వాటినైనా ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే ఆ అవకాశాన్ని కూడా లేకుండా చేస్తోంది.
 
గతంలో మంజూరైన నిధులను ఖర్చు పెట్టొద్దని, పనులు ప్రారంభమైతే ఎక్కడికక్కడ ఆపేయాలని,  పనులు ప్రారంభించకుండా ఉంటే వాటి జోలికెళ్లొద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఎవరైనా పనులు చేస్తే వాటికి బిల్లులు చెల్లించవద్దని ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ  చేసింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు ఆ పనులు ఊసే ఎత్తడం లేదు. పని చేశామని ఎవరైనా బిల్లుకొస్తే ఇచ్చేది లేదంటూ ట్రెజరీ అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. చెప్పాలంటే అభివృద్ధి ఆగిపోయింది.  గత ప్రభుత్వం హయాంలో మంజూరైన స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్‌నే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. దీనికింద రూ.40.86 కోట్లతో 1,046 పనులు మంజూరయ్యాయి.
 
ఇందులో 543 పనులు మాత్రమే పూర్తయ్యాయి.  మిగతా వాటిలో 131పనులు  ప్రారంభించగా, 372పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అయితే,  రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నింటినీ నిలిపేయాలని ఆదేశించడంతో ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంతో  రూ.14.4 కోట్లు   ట్రెజరీలో మురుగుతున్నాయి.   ఇదే తరహాలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, రోడ్లు భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్  తదితర శాఖల్లో కోట్లాది రూపాయల పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. సుమారు రూ.100 కోట్ల నిధులు అక్కరకు రాకుండా ఉన్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల వివరాలు   తెలుసుకుని  బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్దేశమేంటో అర్థం కాక అధికారులు జత్తు పీక్కోవల్సి వస్తోంది. ఉన్న నిధులను వెనక్కి లాగేసి ఇతర పనులకు  వినియోగిస్తారా ? ప్రారంభించని పనులను రద్దు చేసేస్తారా ? అనేది తెలియక గందరగోళంలో వారు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు