ఎపిక్‌ కార్డు ఉన్నా జాబితాలో లేకపోతే ఓటు ఉండదు

22 Feb, 2019 08:29 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

విజయనగరం గంటస్తంభం: ఓటర్లు గుర్తింపు కార్డు (ఎపిక్‌కార్డు) ఉన్నా ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే ఓటు వేసే అవకాశం ఉండదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిజవహర్‌లాల్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక కార్యక్రమని, ఓటు లేని వారు నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు వేసిన వారు, ఎపిక్‌ కార్డులు ఉన్న వారు ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు తుది ఓటర్ల జాబితాతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉంటారని, ఒకసారి పరిశీలించుకుని, ఓటు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవచ్చుని పేర్కొన్నారు.

నిరాక్షరాస్యులకు బీఎల్‌వోలు చదివి వినిపిస్తారని, రాజకీయ పార్టీలు బూత్‌ సహాయకులను నియమించాలని తెలిపారు. వారు పోలింగ్‌ కేంద్రాల వద్ద హాజరై ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హత ఉన్న ఓటర్ల నమోదుకు సహకరించి ఫారం–6 దరఖాస్తు చేయించాలన్నారు. ఓటు నమోదుకు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు ఫారం–8, ఓటు బదిలీకి ఫారం–8ఎ దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ప్రజలకు అవగహన కల్పించేందుకు అన్ని  పంచాయతీల్లో టాంటాం ద్వారా, మున్సిపాల్టీల్లో లౌడు స్పీకర్లు ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు గురువారం ఉదయం సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ వెంకటరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ప్రసాద్‌ పాత్రో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు