ఇంత అణిచివేతనా!

11 Feb, 2019 07:54 IST|Sakshi
కాంట్రాక్ట్‌ , అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాస్పత్రి ముందు ధర్నా చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

మాటలకే పరిమితమైన సర్కారు హామీలు  

ఉద్యోగ భద్రత కల్పనలో తాత్సారం  

కాంట్రాక్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

పశ్చిమగోదావరి, చింతలపూడి: ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నిలువునా దగా చేస్తోంది. జీఓ 12ను జారీ చేయడం ద్వారా వారి హక్కులను హరించాలని చూస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో  పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఒకపక్క పనిభారం, మరో పక్క చాలీచాలని వేతనాలతో ఉద్యోగులుఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఉద్యోగ భద్రత కల్పించకుండా తాత్సారం చేస్తోంది. ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేసిన ప్రతి సారీ వారి కళ్లనీళ్లు తుడవడానికి అన్నట్లు ఒక జీఓ విడుదల చేసి ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబుపై భ్రమలు తొలగిపోయాయి
2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అటు ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చి ఆశలపల్లకిలో ఊరేగేలా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై పెట్టుకున్న భ్రమలు తొలగి పోయాయి.

రాష్ట వ్యాప్తంగా 3 లక్షల మంది
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 60 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, 2.40 లక్షల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలిపి సుమారు 3 లక్షల మంది పని చేస్తున్నారు. ఇక జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 23 వేల మంది కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే సుమారు 3వేల మందికి పైగా ఉన్నారు. వీరు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ పాయింట్‌ రాత పరీక్ష ద్వారా 2003లో ఎంపికయ్యారు.

వీరంతా తమ ఉద్యోగాల రెగ్యులైజేషన్‌ కోసం 15ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు  పీఆర్సీ 2015 మినిమం టైంస్కేలును ఏప్రిల్‌ 1 నుంచి వర్తింపచేస్తూ విడుదల చేసిన జీఓ నంబర్‌ 12 సవరించాలని  కాంట్రాక్ట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 9వ పీఆర్సీ ప్రకారం కాంట్రాక్ట్‌ , అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ను వర్తింపచేస్తూ గత ప్రభుత్వం జీఓ నంబర్‌ 3ను జారీ చేసింది.  అయితే తెలుగుదేశం ప్రభుత్వం జీఓ 12 ద్వారా ఆర్థిక శాఖ ఆమోదంతో పని చేస్తున్న  కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తింపజేయడం దుర్మార్గమైన చర్య అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ జీఓ వల్ల  ఉద్యోగులకు ఉన్న హక్కును హరించడంతోపాటు  10,12 వేల మందికి మాత్రమే టైమ్‌ స్కేలు వర్తింప చేస్తామనడం  రాష్ట్రంలోని 3 లక్షల మంది ఉద్యోగులను వంచించడమే అవుతుందని అంటున్నారు. 2005 నుంచి 2015 వరకు అమలవుతున్న టైంస్కేల్‌ను తెలుగుదేశం ప్రభుత్వమే రద్దు చేసిందని ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు