ఒక్క చెరువూ నింపలేకపోయారు

24 Jun, 2018 10:56 IST|Sakshi
పాదయాత్రలో పాల్గొన్న తలారి పీడీ రంగయ్య, శంకరనారాయణ, నదీం అహమ్మద్‌ 

దోచుకోవడం తప్ప ప్రజాసంక్షేమం పట్టదు

ఇసుక దగ్గర్నుండీ ఇండస్ట్రీస్‌ వరకూ అన్నింటా దోపిడీనే

పరిగి పాదయాత్రలో పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌లు పీడీ రంగయ్య, నదీం ధ్వజం

సాక్షి, పరిగి : ‘ఒక్క చెరువునూ నీటితో నింప లేకపోయారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన టీడీపీని బంగాళాఖాతంలో కలిపేయండి’ అంటూ ప్రజలకు వైఎస్సార్‌సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తలు తలారి రంగయ్య, నదీం అహమ్మద్, పెనుకొండ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ నేతృత్వంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ప్రారంభత్సోవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

మండలంలోని కొడిగెనహళ్లి శ్రీఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర శాసనకోట, నేతులపల్లి, సంగమేశ్వరంపల్లి, ఊటుకూరు, యర్రగుంట, తిరుమలదేవరపల్లి, విట్టాపల్లి వరకూ 16 కిలోమీటర్ల మేర సాగింది. పరిగి మండలంలోని అన్ని చెరువులకూ నీరందించాలని, రైతులకు పంట వేయక మందే ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించాలనే డిమాండ్‌లపై ప్రజలను చైతన్య పరుస్తూ చేపట్టిన పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ఆత్మీయ స్వాగతం లభించింది. 


ఈ సందర్భంగా ఊటుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నదీం అహమ్మద్, రంగయ్య మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుందని విమర్శించారు. మోసపూరిత వాగ్ధానాలతో మరోసారి ముందుకు వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూడగట్టుకున్న అవినీతి సొమ్మంతా ప్రజలదేనని ఎన్నికల్లో ఎంత డబ్బిచ్చినా తీసుకుని విలువైన ఓటు హక్కుతో సీఎం చంద్రబాబును సాగనంపాలని కోరారు. ఇసుక దగ్గర నుంచి ఇండస్ట్రీస్‌ వరకూ అన్నింటా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 

శంకరనారాయణ మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ హంద్రీనీవా కాలువ ద్వారా నీరందిస్తామన్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క చెరువునూ నింపలేకపోయారని అన్నారు. హంద్రీ–నీవా పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి టీడీపీని ఓ దొంగల పార్టీగా మార్చేశారన్నారు. కనీసం రేషన్‌కార్డుల మంజూరులో కూడా నిబద్ధత చూపలేకపోయారన్నారు. చెరువులకు నీరిమ్మంటే అవే చెరువులను పెత్తందార్లకు అమ్మేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు