అసైన్డ్ భూముల అమ్మకానికి పచ్చజెండా!

30 Aug, 2015 13:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన అసైన్డ్ భూములను నిరభ్యంతర పత్రాలు(ఎన్‌ఓసీ) లేకుండా అమ్ముకునేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెట్ట అయితే 5 ఎకరాలు, తరి భూమి అయితే రెండున్నర ఎకరాలను ప్రభుత్వం వీరికి ఉచితంగా కేటాయిస్తోంది. భూమి పొందిన వారు పదేళ్లు అ నుభవించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.

రూ.కోటి లోపు విలువైన భూమి విక్రయానికి జిల్లా కలెక్టర్, రూ.2 కోట్ల లోపు విలువైన భూవిక్రయానికి రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఎన్‌ఓసీని ఇవ్వవచ్చు. రూ.2 కోట్లకుపైగా విలువైన భూమి విక్రయానికి ఎన్‌ఓసీని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది.  కొందరు ఇప్పటికే ఎన్‌ఓసీలు లేకుం డానే సబ్ రిజిస్ట్రార్లను మేనేజ్ చేసి భూములను అమ్మేశారు. భూములు అమ్మేసిన వారి వారసులు ఇప్పుడు తమ భూములను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొనుగోలు చేసిన వారు నష్టపోతారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగర సరిహద్దు ల్లో పూర్వం స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు తీసుకున్న అసైన్డ్ భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో గతంలో ఎన్‌ఓసీలు లేకుండా కొనుగోలు చేసిన వారు ఇబ్బం దులు తప్పవని భయపడుతున్నారు. అందువల్ల ఎన్‌ఓసీలు లేకుండా కొనుగోలు చేసినా చెల్లుబాటయ్యేలా జీవో ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు కూడా ఎన్‌ఓసీ లేకుండా అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి పంపింది.

మరిన్ని వార్తలు