పాలనలోనూరాణిస్తున్న పడతులు

8 Mar, 2015 00:50 IST|Sakshi

అమలాపురం :కాలంతో పాటు పరుగిడుతూ, శక్తియుక్తులకు పదును పెడుతూ..సమస్త రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు రాజకీయంగానూ తమ సామర్థ్యాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని  స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం సగం దాటింది. చట్టసభల్లో చెప్పుకునేంత ప్రాతినిధ్యం లేకపోయినా స్థానిక సంస్థలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. తమకు రిజర్వ్ చేసిన స్థానాల్లోనే కాదు.. నాన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో కూడా గెలిచి త మ సత్తా నిరూపించుకున్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల పుణ్యమాని జిల్లాలో మహిళల ప్రాతినిధ్యం  సగానికి పైగా పెరిగింది.
 
 పంచాయతీలు, వార్డులు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పలువురు ఎన్నికయ్యారు. విభజన అనంతరం ఖమ్మం నుంచి విలీనమైన మండలాలతో జిల్లాలో స్థానిక సంస్థల్లో మహిళల సంఖ్య మరింత పెరిగింది. సభల్లో పురుషులతో సమానంగా సమస్యలపై గళమెత్తడమే కాదు.. సమస్యల పరిష్కారంలో సైతం వారు పురుషులను అధిగమించారు. గత జెడ్పీ సమావేశాల్లో పురుషులకన్నా మహిళలే తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తడం, ఆ సమస్యల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీయడం, వాటి పరిష్కార విషయంలో విస్పష్టమైన హామీలు పొందడం చూసి.. అందరూ ‘మహిళా ప్రజాప్రతినిధులూ! భేష్!’ అన్నారు.
 
 ఇక చట్టసభల విషయానికి వస్తే జిల్లాలో మన్యప్రాంత నియోజకవర్గమైన రంపచోడవరం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వంతల రాజేశ్వరి విజయం సాధించి సంచలనం సృష్టించారు. అరకు ఎంపీగా కొత్తపల్లి గీత విజయం సాధిస్తే, ఎమ్మెల్సీగా టి.రత్నాబాయి తూర్పు ఏజెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నుంచి పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రెండవసారి ఎమ్మెల్యే అయ్యూరు. ఇక మెట్ట ప్రాంతమైన రౌతులపూడి నుంచి లక్ష్మీ శివకుమారి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
 జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఇలా ....
 1. పార్లమెంట్ సభ్యురాలు    :    ఒక్కరు (అరకు ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం అసెంబ్లీ
 నియోజకవర్గం అరకు పరిధిలోకి వస్తోంది)
 2. శాసనమండలి సభ్యులు    :    ఇద్దరు (లక్ష్మీ శివకుమారి, టి.రత్నాబాయి)
 3. శాసనసభ్యులు    :    ఇద్దరు (వంతల రాజేశ్వరి, పిల్లి అనంతలక్ష్మి)
 4. కార్పొరేషన్ మేయర్    :    ఒకరు (రజనీ శేషసారుు, రాజమండ్రి)
 5. మున్సిపల్ చైర్ పర్సన్లు    :    ముగ్గురు (మన్యం పద్మ (సామర్లకోట), కొప్పాడ పార్వతి
 (ఏలేశ్వరం), చెల్లి శాంతకుమారి (ముమ్మిడివరం)
 6. కార్పొరేటర్లు    :    34 మంది (మొత్తం 50 మంది)
 7. కౌన్సిలర్లు    :    134 మంది (మొత్తం 264)
 8. జెడ్పీటీసీలు    :    32 మంది (మొత్తం 60)
 9. ఎంపీపీలు    :    40 మంది (మొత్తం 60)
 10. ఎంపీటీసీలు    :    574 మంది ( మొత్తం 1063 మంది)
 11. సర్పంచ్‌లు    :    480 మంది (మొత్తం 977 మంది)
 
 

మరిన్ని వార్తలు