కదలరు..కదపలేరు!

17 Jun, 2019 12:55 IST|Sakshi
ఆర్‌యూ పరిపాలన భవనం

రాయలసీమ యూనివర్సిటీలో పాతుకుపోయిన ఉద్యోగులు

బదిలీ చేసినా స్థానాలు మారరు

వర్సిటీ వైస్‌చాన్సలర్, రిజిస్ట్రార్‌ల ఆదేశాలు బేఖాతరు

సాక్షి, కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. ఏళ్ల తరబడి వారు కొన్ని విభాగాల్లో తిష్ట వేయడంతో కొత్తగా వచ్చే ఏ విభాగాధిపతి అయినా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిన పరిస్థితి. వారి స్థానాలను మారుస్తూ వైస్‌ చాన్సలర్‌ ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఉద్యోగులు ఖాతరు చేయరు. సీటు మారరు. వీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు కావడంతో పాటు వారు విధులు నిర్వహించే విభాగాలు ఆదాయం వచ్చేవి. దీంతో వారి లాబీయింగ్‌కు వర్సిటీ ఉన్నతాధికారులు తలొగ్గుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 265 మంది ఉన్నారు. వర్సిటీలో పని తక్కువ రాజకీయాలు ఎక్కువ. 12 మంది ప్రోఫెసర్లలో వారు బోధనతో పాటు పరిపాలనకు (బోధనేతర) సంబంధించి ఒక్కొక్కరు మూడు, నాలుగు విభాగాలకు అధిపతులుగా ఉంటున్నారు. వీరు హెడ్స్‌గా ఉన్నా చాలా విభాగాల్లో బోధనేతర సిబ్బంది హవానే నడుస్తోంది. వీరు వర్గాలుగా విడిపోయి పంతం నెగ్గించుకుంటున్నారు. వర్సిటీలో ఒక్క ఉద్యోగి కూడా జాబ్‌ చార్ట్‌ పాటించరు.

వారి కనుసన్నల్లో పాలన..
పరీక్షల విభాగం, దూర విద్య విభాగం, పరిశోధన విభాగం, సీడీసీ, ఫైనాన్స్‌, ప్రిన్సిపల్‌ కార్యాలయాల్లో పాతుకు పోయిన ఉద్యోగుల కనుసన్నల్లో పాలన సాగుతోంది. ఆయా విభాగాలకు ఏ ప్రోఫెసర్‌ అధిపతిగా వచ్చినా ఆయన వారి మాట వినాల్సిందే. లేకపోతే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. సదరు కీలక వ్యక్తులు ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ ఆ విభాగం డైరెక్టర్‌ పెట్టాల్సిందే. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.  దీంతో కొందరు ప్రొఫెసర్లు లేని పోని తలనొప్పులు ఎందుకని పరిపాలనా అంశాల జోలికి వెళ్లడం లేదు.

వైస్‌చాన్సలర్‌ ఆదేశాలూ పట్టవు..
ఆర్‌యూలో పరిపాలన గాడి తప్పిందనేది బహిరంగ రహస్యమే. పరీక్షల విభాగం, డిస్టెన్స్‌, ఫైనాన్స్‌ విభాగాలు ఏర్పడినప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు బదిలీ కాలేదు. రీసెర్స్, సీడీసీ విభాగాల్లో చాలా ఏళ్లుగా అక్కడే ఉన్నారు. ఈ కీలక విభాగాల్లో ఆదాయ మార్గాలు ఉండటంతో అక్కడి నుంచి కదలడానికి ఇష్ట పడరు. పూర్వపు వైస్‌చాన్సలర్‌ నరసింహులు ఆయన పదవీకాలం ముగిసే ఆరు నెలల ముందు బోధనేతర సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏ ఒక్క ఉద్యోగి కూడా వారి స్థానాల నుంచి కదలలేదు.

తమను ఏమీ చేసుకోలేరనే ధీమానో.. సదరు అధికారి చేసిన తప్పిదాల గుట్టు వారి దగ్గర ఉందనే ధైర్యమో తెలియదు. బదిలీలకు సాహసించని ప్రస్తుత వీసీ ప్రస్తుత వీసీ ప్రసాదరావు బదిలీల ప్రక్రియ చేపట్టడానికి సాహసించడం లేదు. మొదట్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి వర్సిటీ పాలనను గాడిన పెడతానని పలు మార్లు మీడియా ముఖంగా వెల్లడించారు. ఏడాదవుతున్నా వాటి జోలికి వెళ్లడం లేదు. కదిపితే ఎక్కడ తన ఉనికికే ప్రమాదం వస్తుందనే అభిప్రాయంతో వీసీ బదిలీలకు సాహసించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇతర ఏ వీసీ హయాంలో జరగనన్ని గొడవులు, ఆందోళనలు ఈయన పీరియడ్‌లో జరుగుతున్నాయి. నాలుగైదు సార్లు బోధనేతర సిబ్బంది వీసీ చాంబర్‌లోకి వచ్చి ఆయనను అసభ్య పదజాలంతో దూషింనా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఉద్యోగుల్లో 80 శాతం మంది వీసీ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిలో పలువురు ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థి నేతలు గత ఎన్నికల్లో కోడుమూరు, నందికొట్కూరు నియోజక వర్గాల టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వర్సిటీలో పోస్టులు, పదోన్నతులు పొందేందుకు వీసీపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పక్కా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరింన పూర్వపు రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ రిలీవ్‌ అయ్యే ముందు కొందరు ఉద్యోగులకు పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు దస్త్రం సిద్ధం చేసిన విషయం బయటికి పొక్కడంతో వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారు. అయినా, సదరు అధికారి తన పని తాను చేసినట్లు సమాచారం. ఈ దస్త్రం ప్రస్తుతం వీసీ దగ్గర ఉన్నట్లు వినికిడి. అదే టీడీపీ వ్యక్తిగా ముద్ర పడ్డ వీసీ ఒత్తిళ్లకు తలొగ్గి దస్త్రాన్ని క్లియర్‌ చేస్తారా? లేక పక్కన పెడతారో చూడాల్సి ఉంది. 

విభాగాల వారీగా కొందరు తిష్ట వేసిన స్థానాలు
☛ దూరవిద్య విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి, మరో ఇద్దరు ఉద్యోగులు ఆ విభాగం ఏర్పడినప్పటి నుంచి అక్కడే ఉన్నారు.
☛ రీసెర్స్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్, ముగ్గురు ఉద్యోగులదీ అదే పరిస్థితి.
☛ వర్సిటీ ప్లేస్‌మెంట్‌ అధికారిగా ఏళ్ల తరబడి ఒకరు కొనసాగుతున్నారు.
☛ పరీక్షల విభాగంలో ఉద్యోగులందరూ ఆ విభాగాన్ని శాసించే స్థాయి పాతుకుపోయారు.
☛ సీడీసీ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు.
☛ ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో ఏళ్ల తరబడి ఉన్న ఉద్యోగులదే పెత్తనం
☛ కొత్తగా ఏర్పడిన ఫైనాన్స్‌  విభాగంలో ముగ్గురు ఉద్యోగులు అక్కడి నుంచి కదలకుండా ఉన్నారు.
☛ వర్సిటీలో 15 మంది దాకా ఉద్యోగులు ఉదయం వచ్చి సంతకం చేస్తారు. తర్వాత వారిసొంత వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.

కొత్త రిజిస్ట్రార్‌ వచ్చాకే బదిలీలు
వర్సిటీలో బోధనేతర సిబ్బంది బదిలీలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ ఉన్నారు. రెగ్యులర్‌ రిజిస్ట్రార్‌ వచ్చాక బదిలీల ప్రక్రియ చేపడతాం. కొంత మంది వచ్చి ఉద్యోగాలు అడుగుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారు. అడిగిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కదా.

– ఎ.వి.ప్రసాదరావు, వీసీ   

మరిన్ని వార్తలు