ఈ పోలీసుస్టేషన్‌కు సొంత భవనమేదీ?

23 Mar, 2016 01:54 IST|Sakshi

అద్దె భవనంలోనే కొత్తపేట పీఎస్
 స్థల పరిశీలన అయినా కార్యరూపం దాల్చని వైనం

 
చిట్టినగర్ : కొత్తపేట పోలీస్ స్టేషన్ సొంత భవనం కల ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టేషన్‌కు సొంత భవనం నిమిత్తం పలు దఫాలుగా స్థల పరిశీలన జరిగినా ఇంత వరకు స్టేషన్ నిర్మాణం కార్యాచరణలోకి రాకపోవడంతో అద్దె భవనంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నగరంలోని అత్యధిక కేసులు నమోదయ్యే స్టేషన్ల క్రమంలో కొత్తపేట పీఎస్‌కు ఏళ్ల తరబడి రికార్డు ఉంది. అయితే గతంలో కేసుల సంఖ్య, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కొత్త పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే ప్రభుత్వం అద్దె భవనాలలో ఉన్న పీఎస్‌లకు సొంత భవనాలను నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తపేట స్టేషన్ పరిధి రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉండటంతోపాటు జక్కంపూడి వైఎస్సార్ కాలనీ నిర్మాణం, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పేదలను కాలనీకి తరలించడంతో కాలనీలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం తథ్యమని పోలీసులు భావించారు.

పలు దఫాలుగా స్థల పరిశీలన
వైఎస్సార్ కాలనీతోపాటు పాలప్రాజెక్టు క్వార్టర్స్ స్థలాన్ని స్టేషన్ నిర్మాణం కోసం పోలీసు ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేసినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్ల కిందట అప్పటి పోలీసు శాఖ కార్యదర్శి డీపీ దాస్, అప్పటి నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తోపాటు పలువురు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో కాలనీలో పీఎస్ భవన నిర్మాణానికి అవసర మైన స్థలాన్ని ఇచ్చేందకు కార్పొరేషన్ ముందుకు రాగా ప్రస్తుతం భవన నిర్మాణానికి 750 గజాల స్థలం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు భవన నిర్మాణ తధ్యమని భావించారు. అయితే గతంలో నిధులు విడుదల కాగా స్థలాన్ని గుర్తించడంలో ఆలస్యం కావడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. ఈ దఫా స్థల పరిశీలన అయినా భవన నిర్మాణం మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.
 
దశాబ్దాలుగా..

 ప్రస్తుతం కొత్తపేట వాగు సెంటర్‌లోని ఓ అద్దె భవనంలో పోలీస్ స్టేషన్‌ను నిర్వహిస్తుండగా నిర్వహణ కింద భారీగానే ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి క్రైం విభాగం ఎత్తి వేసినప్పటికీ ఎస్.ఐలు అందరూ ఒకే గదిలో కేసులను విచారిస్తుండటంతో  వాటి పురోగతిపై ఏ మేరకు ముందుకు సాగుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 

మరిన్ని వార్తలు