ప్రజాభిమానానిదే గెలుపు

15 Mar, 2014 03:00 IST|Sakshi
ప్రజాభిమానానిదే గెలుపు

ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ప్రజాభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని.. ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో దూరదృష్టితో అమలు చేసిన పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

ఆ పథకాలు తిరిగి ప్రజలకు చేరువ కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. తమ నాయకుడు అధికారంలోకి రాగానే అమ్మఒడి, రైతులకు రూ.3వేల కోట్లతో ప్రత్యేక నిధి, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, పింఛన్ పెంపును అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను నిలువునా చీల్చిన కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖాళీ అయిందని.. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందాన్ని కొనసాగిస్తున్న టీడీపీ ఎన్నికల తర్వాత గల్లంతు కాక తప్పదన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతో సీమాంధ్రకు తీరని నష్టం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో చోటు లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరుతున్నారన్నారు. అంతమాత్రాన విభజన వాదులకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీలో సీమాంధ్ర నేతలు రాజకీయ ఆశ్రయం పొందడం సిగ్గుచేటన్నారు.
 

మరిన్ని వార్తలు