కోస్తాలో కుండపోత

21 Jun, 2015 02:30 IST|Sakshi
భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా కాతేరు వద్ద కుంగిన రివిట్‌మెంట్‌వాల్

* ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వానలు
* చింతూరులో 26, విశాఖలో 17 సెం.మీల వర్షపాతం
* అధికారులు అప్రమత్తం.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

సాక్షి నెట్‌వర్క్: కోస్తా జిల్లాలను వర్షం ముంచెత్తుతోంది. రుతుపవనాలకు, అల్పపీడనం తోడు కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత రెండురోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

లోతట్టు ప్రాంతాల గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు కాగా అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో రెండురోజులు భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.

పలు జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 233.8 మి.మీలు వర్షం కురవగా, శనివారం 734 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. విశాఖపట్నం జిల్లాలో మూడురోజుల నుంచి కరువు తీరా వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా చింతూరులో 26 సెం.మీ నమోదైంది.
 
ఆచూకీ లేకుండా పోయిన 24 పడవలు
తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 4 రోజుల క్రితం 161 మంది మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 23 బోట్ల ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం కాకినాడలో మత్స్యకార నాయకులు, బోట్లు యజమానులు, అధికారులతో చర్చించారు. ఇదే విధంగా కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారుల, నెల్లూరు జిల్లాకుచెందినవారు మరో ఆరుగురు గల్లంతయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు