పుస్తకాల్లేవ్.. చదువెలా!

6 Jul, 2015 00:47 IST|Sakshi
పుస్తకాల్లేవ్.. చదువెలా!

నేటికీ పంపిణీ కాని పాఠ్యపుస్తకాలు
 
విజయవాడ : ప్రింటింగ్ ప్రెస్‌ల ముద్రణలో తీవ్ర జాప్యం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయం వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 20 రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి వారం ముందే పాఠశాలలకు పుస్తకాలు చేరతాయని, జూన్ 15 నాటికల్లా వాటిని పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆచరణలో అది జూలై 20 నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,340 ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలను ప్రభుత్వమే పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ విధంగా 20 లక్షల 21 వేల 305 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, దశలవారీగా పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ముద్రణాలయంలో ప్రింట్ అయ్యి.. జిల్లాలోని మెయిన్ స్టోర్స్‌కు వచ్చేవి. వాటిని మండలాల వారీగా పోస్టల్ శాఖ ద్వారా సరఫరా చేసేవారు.

విద్యా సంవత్సరం మొదలైన వారం రోజుల కల్లా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేది. ఈ ఏడాది రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ముద్రణాలయం నుంచి పుస్తకాలు సరఫరా కాలేదు. దీంతో ప్రభుత్వం పుస్తకాల ప్రింటింగ్ బాధ్యతలను ఆరు జిల్లాల్లోని ప్రింటింగ్ ప్రెస్‌లకు అప్పగించి వాటి ద్వారా 13 జిల్లాలకు సరఫరా చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 20 లక్షల 21 వేల పుస్తకాలకు గాను 18 లక్షల 95 వేల 939 పుస్తకాలు విజయవాడ ఆటోనగర్‌లోని స్టోర్స్‌కు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 17 లక్షల 77 వేల 767 పుస్తకాలు పంపిణీ చేశారు.
 
కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రాధాన్యం...
 మిగిలిన పుస్తకాల పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ప్రెస్‌ల నుంచి రావాల్సిన పుస్తకాలు ఆలస్యమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో ప్రైవేట్ ప్రెస్‌లు వివిధ కార్పొరేట్ విద్యా సంస్థల పుస్తకాలు ముద్రణ చేసే బిజీలో ఉండి ప్రభుత్వ ఆర్డర్లను పక్కన పెడుతున్నాయి.
 
కలెక్టర్ అసంతృప్తి...: శనివారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న పుస్తకాల స్పోర్ట్స్‌ను పరిశీలించారు. పుస్తకాల పంపిణీ జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మొదలై 20 రోజులు దాటినా ఇంకా పంపిణీ చేయకపోవటమేమిటని జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించారు. దీనిపై దృష్టి సారించి వెంటనే పుస్తకాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
ఇంటర్ పుస్తకాలదీ అదే పరిస్థితి...
 ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ పుస్తకాలను కూడా ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల వరకు ఇంటర్మీడియెట్ పుస్తకాలు అవసరం కాగా, వాటిలో ఇప్పటి వరకు 60,647 పుస్తకాలు మాత్రమే అందాయి. మిగిలిన పుస్తకాలు దశలవారీగా అందనున్నాయి.
 
 

మరిన్ని వార్తలు