అయినోళ్లు ఇక్కడే!

21 Jan, 2014 01:54 IST|Sakshi

కర్నూలు, న్యూస్‌లైన్: రెండో పటాలంలో ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలు, ఆరుగురు ఏఆర్ ఎస్‌ఐలు, 33 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 97 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ కమాండెంట్ విజయ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. బయటి కంపెనీల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ బదిలీల్లో వీరి బాధలను పట్టించుకోకపోవడం గమనార్హం.

దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే బదిలీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నా అనుకూలమైన వారికే పెద్దపీట వేసినట్లు చర్చ జరుగుతోంది. ఏ కంపెనీ నుంచి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఆఫీసర్ కమాండింగ్(ఓసీ) నుంచి ఎన్ని ఫార్వర్డ్ అయ్యాయి.. అసిస్టెంట్ కమాండెంట్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఏ ప్రాతిపదికన బదిలీ చేశారనే విషయాలపై స్పష్టత కొరవడింది.

మెడికల్, స్పౌజ్, కొత్తగా పెళ్లయిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సదరు సిబ్బంది బయటకు చెప్పుకోలేక మౌనంగా రోదిస్తున్నారు. కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, ఆర్‌ఐతో పాటు మరికొందరు కమిటీ సభ్యుల కసరత్తుతో బదిలీల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అలాంటిది కమిటీలో కొందరు సభ్యులకు తెలియకుండానే ఈ ప్రక్రియ ముగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై పలువురు సిబ్బంది సోమవారం డీజీపీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు