సీఎం స్ఫూర్తికి ప్రై‘వేటు’

8 Sep, 2019 10:55 IST|Sakshi
మండపేటలోని ప్రైవేట్‌ పాఠశాలకు బ్యాగులతో వెళుతున్న విద్యార్థులు

సర్కారు బడుల్లో సరే... ప్రైవేటు స్కూళ్లలో ఏదీ?

అమలుకు నోచని ‘నో బ్యాగ్‌ డే’

రెండునెలలైనా నిర్లక్ష్యమేనా?

యాజమాన్యాలకు ఒక్క నోటీసూ ఇవ్వని అధికారులు

‘సాక్షి’బృందం సర్వేలో వెల్లడి

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నో...స్కూల్‌ బ్యాగ్‌ డే’ పాటించాలని మూడు నెలల ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా బే ఖాతరంటూ ప్రయివేటు పాఠశాలలు తమ పాత దారిలోనే నడుస్తున్నాయి. యథేచ్ఛగా ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బండెడు పుస్తకాల బరువుతో చిన్నారులు పడుతున్న కష్టాలను ప్రజాసంకల్ప యాత్రలో  చూసి చలించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక ‘నో బ్యాగ్‌ డే’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు నెలలో మొదటి, మూడో  శనివారం దీనిని కచ్చితంగా అమలు చేయాలని జూలై నెలలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటా అమలుకు ఆదేశాలు వచ్చాయి. కేవలం పుస్తకాలకే పరిమితమైపోతున్న విద్యార్థులలో మానసిక ఒత్తిడిని దూరం చేసి సృజనాత్మకతను వెలికితీయాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్వాకంతో అటకెక్కుతోంది. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని ప్రైవేటు యాజమాన్యాల్లో నడుస్తున్న పాఠశాలలపై నిఘా పెట్టగా డొల్లతనం బట్టబయలైంది.

విద్యా డివిజన్లు    ప్రైవేటు స్కూళ్లు     విద్యార్థులు
అమలాపురం        85                     15,999
కాకినాడ              124                    23,566
పిఠాపురం             80                     17,903
రామచంద్రాపురం    80                     16,672
రాజమహేంద్రవరం  102                    21,135
 మొత్తం                471                    94,275 

 ఆ రోజు ఏమి చేయాలి...?
‘నో బ్యాగ్‌ డే’ పేరుతో ఆనంద పాఠాలు బోధించేలా ప్రణాళికను ప్రభుత్వం  రూపొందించింది. ఉదయం నాలుగు తరగతుల్లో నీతి కథల బోధన, చిత్రలేఖనం, నైతిక విలువలు, సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. అనంతరం క్రీడలు, యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలి. కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదాగా ఆటలు ఆడించాలి. అలాగే పాఠశాలలో సాగు చేస్తున్న బడితోటలో పాదులు వేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం వంటి వాటిని అలవాటు చేయాలి. గ్రంథాలయాల్లో పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం, వాటిపై చర్చించే అంశాలు నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపల్, వ్యవసాయదారులు, తదితర పెద్దలను పిలిచి పిల్లలతో మాట్లాడించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్‌) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన మండలి సూచనల ప్రకారం 1, 2 తరగతులకు భాష, గణితం, 3, 4 తరగతులకు సామాన్య శాస్త్రం, గణితం తప్ప ఇతర సబ్జెక్ట్‌ పుస్తకాలు ఉండకూడదు. అదనపు పుస్తకాలు తీసుకు రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు. అదనపు మెటీరియల్‌ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు.     వీటిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. 

అన్ని పాఠశాలలూ పాటించాలి..
ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేయాలి. ఈ మేరకు అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగానే వీటిని అమలు చేస్తున్నారు. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం.
-డి.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా