ధాన్యం..దైన్యం

25 Jun, 2014 04:43 IST|Sakshi
ధాన్యం..దైన్యం

- ధాన్యం కొనేనాథుడు కరువు
- మళ్లీ పెట్టుబడులు లేక అవస్థలు
- రుణ మాఫీపై స్పష్టతేదీ

పంట చేతికందే దాకా రైతుకు ఒక రకమైన శ్రమ.. తీరా ధాన్యపు రాశులు ఇంటికి చేరాక వాటిని అమ్ముకోవడం అన్నదాతకు పెద్ద పనవుతోంది. కష్టించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని పురుల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో సరైన ధర లేక ధాన్యపు నిల్వలు పేరుకుపోయాయి.
 
కారంచేడు: అన్నదాతలు వరిసాగంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన వరిధాన్యంను పురులు కట్టుకొని గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో కొంత కాలం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే వారు లేక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని కారంచేడు, స్వర్ణ, కుంకలమర్రు, ఆదిపూడి, రంగప్పనాయుడువారిపాలెం, స్వర్ణపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. మండలంలో మొత్తం 40 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 15 వేల ఎకరాలు ఖరీఫ్‌లో, 10 వేల ఎకరాలు రబీలో వరి సాగు చేస్తుంటారు.

ఈ ప్రాంతంలో కారంచేడు మండలంలోనే వరి ఎక్కువగా సాగవుతుంది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన వరదలతో వేసిన పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో నాట్లు ఆలస్యంగా వేశారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటలను ఇళ్ల ముంగిట పెట్టుకొని కొనే వారి కోసం దైన్యంగా ఎదురు చూస్తున్నారు.
 
కొనేనాథుడే కరువయ్యాడు..
- మండలంలో ఏటా సుమారు  8 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండిస్తుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 98 శాతం ధాన్యం రైతుల ముంగిట పురుల్లో  మూలుగుతోంది.
- ఈ ప్రాంతంలో 92 రకం, 2270 రకం, జీలకర రకం ధాన్యం సాగు చేస్తుంటారు.  
- 92, 2270 రకం ధాన్యం క్వింటా రూ.1200-రూ.1300 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. జిలకర రకం ధాన్యం క్వింటా  1050-రూ.1100 మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం అవి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు.  
- మళ్లీ సాగు సీజన్ ప్రారంభం కావడంతో వాటికి అవసరమైన పెట్టుబడులకు సన్న, చిన్నకారు రైతులతో పాటు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
- కౌలు ఎకరానికి 18-20 వేలు వరకు ఉంది. వీటిలో ఎక్కువ మంది డబ్బు కౌలుకే మొగ్గు చూపడంతో కౌలు రైతులు అప్పులు చేసి కౌలు కట్టుకున్నారు. ఇవి కాకుండా దుక్కులు, విత్తనాలు, ఎరువులకు అవసరమైన పెట్టుబడులకు అవసరమైన డబ్బు కోసం నానా అవస్థలు పడుతున్నారు.
 

రుణమాఫీపై స్పష్టత లేదు..
అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకా దానిపై ఏ విధమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న అన్నదాతలు రుణమాఫీలు చేస్తారా.. లేదా, ఒకవేళ చేసినా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అనే సందిగ్ధంలో ఉన్నారు. మళ్లీ అప్పుల కోసం బ్యాంకులకు ఎలా వెళ్లాలి, వెళ్తే ముందు తీసుకున్న రుణాలు చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తే పరిస్థితి ఏంటని అన్నదాతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ సాగు ప్రశ్నార్థకమేనని రైతులంటున్నారు.

మరిన్ని వార్తలు