ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదు

28 Aug, 2015 01:15 IST|Sakshi

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వివిధ పార్టీలకు చెందిన నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షణలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో పాల్గొన్న ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ   ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి ప్రత్యేకహోదా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు నిర్ఘాంతపోయారన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి  మిత్రపక్షమైన కేంద్రంలోని బీజేపీ నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
 
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసమే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పార్టీ ప్రజలకు అండగా పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని విభజించడంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ, బీజేపీలు ప్రత్యేక హోదాపై కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బంద్ విజయవంతం చేయడంపై అఖలపక్ష నాయకులు చర్చించారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగ శ్రీకాంత్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీఏపీ శ్రీనివాస రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు