అంతంత మాత్రమే

20 Jun, 2014 03:38 IST|Sakshi
అంతంత మాత్రమే

- అన్నదాతలను ఆదుకోని రైతు బంధు
- అధ్వానంగా  పథకం అమలు
- అరకొరగా కేటాయింపులు

కడప అగ్రికల్చర్: పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు.. ధర వచ్చేవరకు నిలువ ఉంచుకుందామనుకున్నా వీలుపడటం లేదు.. దీంతో రైతన్న పండించిన అరకొరపంటను అయిన కాడికి కళ్లంలోనో, పొలంలోనో తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో అవస్థలు తప్పడంలేదు.

ఒకప్పుడు రైతులకు ఎంతో ఉపయోగక రంగా ఉన్న రైతుబంధు పథకం ప్రస్తుతం ఉన్నా లేనట్టేనని చెప్పకతప్పదు. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కడప, ప్రొద్దుటూరు మార్కెట్‌లు కీలకమైనవి. ఈ మార్కెట్ యార్డుల్లో గోడౌన్లకు కొదవలేదు. ఒకటి, రెండు మినహా  మెజార్టీ మార్కెట్ కమిటీలు రైతులకు ఉపయోగపడే రైతుబంధు పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి.
 
ఈ ఏడాది కేటాయింపులు అంతంత మాత్రమే :
రైతుబంధు పథకానికి ఈ ఏడాది కూడా అంతంత మాత్రంగానే నిధులు కేటాయించారు. కడప మార్కెట్‌యార్డుకు రూ 50 లక్షలు, ప్రొద్దుటూరుకు రూ.2లక్షలు, బద్వేలుకు రూ. 10 లక్షలు, మైదుకూరుకు రూ. 30 లక్షల నిధులను రైతులకు ఇవ్వనున్నట్లు రికార్డుల్లో పొందుపరచారు. మార్కెట్‌లో ఏటా ఎగుడుదిగుడుగా ధరలు ఉంటుండటంతో రైతులు పంట ప్రారంభంలో ఉన్న ధరకే ఉత్పత్తులను విక్రయించడం అలవాటు చేసుకుంటున్నారు. మార్కెట్ గోడౌన్లలో దాచుకుని ధరలు వచ్చాక విక్రయించుకొండి అని చెప్పేవారు కరవవుతున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది రైతుబంధు పథకాన్ని వినియోగించుకునేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
 
దూరమవుతున్న పథకం
పండించిన పంటలకు మార్కెట్‌లో తగిన గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులు వాటిని మార్కెట్ యార్డుల్లోని గోడౌన్లలో నిల్వ చేసుకుని రుణం పొందడానికి ప్రభుత్వం వీలుకల్పించింది. ప్రస్తుతం  వివిధ పంటలకు గిట్టుబాటు ధర కరువవుతోంది. ఈ పథకాన్ని అధికారులే రైతుల కు దూరం చేస్తున్నారనే విమర్శలు  వినిపిస్తున్నాయి.  ఏటా దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కో ట్ల నిధులు కేటాయించి  పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా  రానురాను బడ్జెట్ కేటాయింపు తగ్గి స్తూ వస్తున్నారు.

2010లో 77 మందికి రూ.79.33 లక్షలు, 2011లో 259 మందికి రూ.1.08 కోట్లు, 2012లో  22 మంది రైతులకు రూ. 6.43 లక్షలు మాత్రమే ఇచ్చారు. 2013వ సంవత్సరంలో  320 మందికి రూ. 3.19 కోట్లు రుణంగా  చెల్లించారు. రైతుల కోసం  ఉపయోగించాల్సిన గోడౌన్లను అధికారులు ఇతర కార్యకలాపాలకు అద్దెకు ఇస్తున్నారు. కడప మార్కెట్ యార్డులో 2500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్‌లో కొంతభాగం ఆప్కోకు, మరికొంత బాగం పౌరసరఫరాలశాఖకు ఇచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా