అందరి ‘నోటా’ వింటున్న మాట

29 Mar, 2019 16:56 IST|Sakshi

ఓటములకు కారణమవుతున్న నోటా ఓటు

ఈ ఎన్నికల్లో రెట్టింపయ్యే అవకాశం

సుపరిపాలన కోసం ప్రతిఒక్కరూ ఓటెయ్యాలని సూచన

సాక్షి, శ్రీకాకుళం: మాటలు మార్చేవారు కొందరు... ప్రలోభాలు పెట్టేవారు ఇంకొందరు... నేర చరిత్ర కలిగినవారు మరికొందరు... ఇటువంటి లక్షణాలు కలిగిన రాజకీయ పార్టీల నేతలను ఓటర్లు నోటా రూపంలో తిరస్కరిస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకుగాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8,998 ఓట్లు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 6,133 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈ విధానం తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు, అక్కడ ఓడిన అభ్యర్థుల తలరాతను మార్చేసింది. ఈ దఫా నోటా ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగైతే పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిత నోటా ఓటుపై ఆధారపడి ఉంది.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే, ఓటు ఎవ్వరికి వేయాలన్న సందిగ్ధంలో చాలా మంది పోలింగ్‌ కేంద్రానికి రావడం మానేస్తున్నారు. ఆ సందేహాన్ని వీడుతూ అందర్ని పోలింగ్‌ కేంద్రానికి రప్పించేందుకు 2014లో ఎన్నికల సంఘం ఈవీఎంల్లో కొత్తగా ఒక బటన్‌ను పరిచయం చేసింది. దాని పేరు నోటా. అంటే ‘నన్‌ ఆఫ్‌ ది ఎబౌ’ (పై వారిలో ఎవ్వరూ లేరు) ఈవీఎంలో చివరి బటన్‌ను నోటాకు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు లేరని ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు నోటా మీటను ఉపయోగించుకుంటున్నారు. పరిచయమైన తొలి సంవత్సరం ఎన్నికల్లోనే నోటాను లక్షల మంది ఓటర్లు వినియోగించుకున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాల వారీగా పడిన నోటా ఓట్లు

అసెంబ్లీ స్థానం నోటా ఓట్లు
ఇచ్ఛాపురం  951
పలాస  934
టెక్కలి  770
పాతపట్నం  928
శ్రీకాకుళం  1,106
ఆమదాలవలస  665
ఎచ్చెర్ల  749
నరసన్నపేట   819
రాజాం  694
పాలకొండ  1,382

2009 ఎన్నికల్లోనే అనుకున్నా...
వాస్తవానికి 2009 ఎన్నికల్లోనే నోటాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం తొలిసారి సుప్రీం కోర్టుకు వివరించింది. అప్పటి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా, పౌరహక్కుల సంస్థ, పీయూసీఎల్‌ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో నోటాను అమలులోకి తీసుకురావాలంటూ 2013 పెప్టెంబర్‌ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా బటన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం అంటే  60 లక్షల మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఆ తర్వాత పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో నోటాకు ఓటే వేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు కలవరం ఎక్కువైంది.

కొన్ని ప్రాంతాల్లో ఓడిన, గెలిచిన అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్లు తేడా కంటే నోటా ఓట్లు ఎక్కువగా పోలవుతుండటం గమనార్హం. పక్కనే తెలంగాణాలో నోటా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1.25 లక్షల మంది నోటా ఓట్లు పోలవ్వగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటింగ్‌ శాతంలో నోటా ఏడో స్థానంలో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓటు జిల్లాలో పడింది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిశీలిస్తే, నోటాకు 0.54 శాతం ఓట్లు పడ్డాయి. అంటే పోలైన ఓట్లలో నోటాకు 6,133 ఓట్లు పడ్డాయి.

నోటాకి ఎందుకు వేయాలి.. ఆలోచించండి
నోటాను విలువైన ఓటుగా పరిగణిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. అభ్యర్థుల ఓట్లు కంటే ఎక్కువ నోటాకి వస్తే, తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. కాని అభ్యర్థుల కంటే నోటా ఓట్లు ఎక్కువ పోలైతే, మరోసారి ఎన్నికలు నిర్వహించి, ఆ అభ్యర్థులు కాకుండా వేరే వారిని నిలపాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఆ ఎన్నికల ఖర్చంతా ఆ రాజకీయ పార్టీలే భరించేలా చట్టాన్నీ చేయాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత పోలైన ఓట్ల జాబితాల్లో నోటాని చేర్చి ఎన్నికల సంఘానికి ఆయా జిల్లాల నుంచి పంపించారు.

అయితే నోటా విలువైన ఓటు కాదని ఆ వివరాలు విడిగా పంపించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘాల కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్‌ అధికారులకు సమాచారం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు నోటాను ఒక విలువైన ఓటుగా భావించిన ఓటరు కంగుతిన్నారు. దీనిపై నిరసన వ్యాఖ్యలు వినిపించాయి. అందుకే ఓటుహక్కును ఏ విధంగాను దుర్వినియోగం చేయకుండా ఉన్న అభ్యర్థుల్లో మంచి అభ్యర్థికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి.

ఓటుహక్కు వినియోగించుకోవాలి.
ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ సమర్థుల్లో.. మంచివారో.. ప్రజలకు మేలు చేసేవారెవరు వంటి గుణగణాలు పరిశీలించాలి. ఇవేమీ నచ్చకుంటే నోటాకు ఓటు వేయొచ్చు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విధానం కేవలం వ్యతిరేకత చూపించడానికే పనికొస్తుంది. ప్రజాస్వామ్యంతో ఓటుతోనే ప్రగతి సాధించాలి. అందుకే ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి.
– కూన అచ్యుతరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, బీఆర్‌ఏయూ

మరిన్ని వార్తలు