నకిలీ రూ.2 వేల నోటుతో బురిడీ

24 Dec, 2016 02:16 IST|Sakshi
నకిలీ రూ.2 వేల నోటుతో బురిడీ

డాబాగార్డెన్స్‌: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.2వేలు నోటును కలర్‌ జెరాక్స్‌ తీసి ఇద్దరు మహిళలు బురిడీ కొట్టించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం పరిసరాల్లో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ పరిసరాల్లో పలువురు చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇద్దరు మహిళలు ఓ దుకాణంలోకి వెళ్లి రాగి, ఇత్తడి వస్తువులు బేరమారారు. నకిలీ రూ.2వేల నోటును దుకాణ యజమానికి ఇవ్వగా.. ఆయనకు అనుమానం వచ్చి చిల్లర లేదని పంపించేశారు. మరో షాపునకు వెళ్లగా అక్కడ కూడా చిల్లర లేదని పంపించేశారు.

ఎదురుగా ఉన్న నాగమణికి చెందిన దుకాణానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. ఉదయం నుంచి బేరం లేకపోవడం.. తొలి బేరం కావడంతో ఆమె వ్యాపారాన్ని వదులుకోలేకపోయింది. రూ.600ల విలువ చేసే పూజా సామగ్రిని కొనుగోలు చేసి ఇద్దరు మహిళలు వారి వద్ద ఉన్న రూ.2వేల దొంగనోటు అందజేశారు. నోటు నలిగిపోయి ఉండడంపై నాగమణి ప్రశ్నించగా.. బ్యాగులో పెట్టడడంతో నలిగిపోయిందని బదులిచ్చారు. దీంతో నాగమణి రూ.600లు తీసుకొని వారికి రూ.1400 చిల్లర ఇచ్చింది. వారు వెళ్లిపోయాక నాగమణికి మళ్లీ అనుమానం వచ్చి నోటును వేరే వారికి చూపించింది. ఇది దొంగనోటని.. కలర్‌ జెరాక్స్‌ తీసి ఇచ్చేశారని చెప్పడంతో ఆమె కంగుతింది. వెంటనే పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు చేసిందేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. వారు వెళ్లిపోయాక వస్తే మేం ఏం చేస్తామని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఆ ఇద్దరు మహిళలను గుర్తించవచ్చని చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నాగమణి బోరున విలపించింది.  

మరిన్ని వార్తలు