రాష్ట్ర విభజన నోట్ విడుదల

19 Oct, 2013 21:30 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మీడియాకు నోట్‌ విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి హోంశాఖ రూపొందించిన సమాచారాన్ని మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం)  పరిశీలించింది. వచ్చిన ఈ మెయిల్‌ సమాచారాన్ని జీఓఎం చర్చించింది. ఈ మెయిల్‌లో వచ్చిన సమాచారంతో ఆయా శాఖలు తమ నివేదికలను మార్పు చేయాలని హొం శాఖ ఆదేశించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలు జీఓఎంకు నిర్దిష్ట సిఫార్సులు చేయాలని తెలిపింది.

11 శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్రానికి చేరింది. రాష్ట్ర విభజనపై సూచనలతో పెద్ద సంఖ్యలో ఈ మెయిల్స్‌ వచ్చాయి. సూచనలు స్వీకరించేందుకు కొంత సమయం ఇవ్వాలని జీఓఎం నిర్ణయించింది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ సలహాలు, సూచనలు జీఎంఓకు పంపించవచ్చునని హొం శాఖ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఈ రోజు జరిగిన  కేంద్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) సమావేశంలో రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించినట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. గంటన్నరసేపు జరిగిన సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా శాఖల కార్యదర్శులు సమాచారాన్ని పంపారని తెలిపారు. ఇప్పటి వరకు 2000 ఇమెయిల్స్ వచ్చాయని చెప్పారు.  వాటన్నిటినీ శాఖల వారీగా వర్గీకరించి ప్రభుత్వ కార్యదర్శులకు పంపుతామన్నారు. నవంబర్ 7 మరోసారి సమావేశమవుతామని చెప్పారు. సమావేశానికి ఆంటోనీ హాజరు కాలేదన్నారు. ఈ సమావేశానికి  సుశీల్ కుమార్ షిండేతోపాటు కేంద్ర మంత్రులు గులామ్ నబీ ఆజాద్‌, వీరప్పమొయిలీ, జైరాం రమేష్‌, చిదంబరం, నారాయణస్వామి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు