ఆరోగ్యశ్రీ వర్తించదని పిండేశారు!

18 Jun, 2019 05:08 IST|Sakshi
ఆస్పత్రిలో ధనోజ్‌తో తల్లి లలిత, విశాఖ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్త

విశాఖలో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వాకం

కిడ్నీలు పాడై ప్రాణాపాయంలో తొమ్మిదేళ్ల బాలుడు

రూ.70 వేలు వసూలుచేసిన ఆస్పత్రి యాజమాన్యం

వాట్సాప్‌లో ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నానికి గోడు చెప్పుకున్న బాధితులు

వారితో స్వయంగా మాట్లాడిన మంత్రి

చెల్లించిన సొమ్మునూ తిరిగిచ్చేయాలి..

ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా ఆదేశాలు.. ఆస్పత్రికి నోటీసులు

సాక్షి, విశాఖపట్నం : ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయాల్సిన ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి.. రోగి కుటుంబాన్ని పిండేసింది. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించదని.. వైద్యానికి నగదు చెల్లించాల్సిందేననడంతో విధిలేని పరిస్థితిలో అప్పుచేసి మరీ సదరు ఆస్పత్రికి చెల్లించారు. ఇదే విషయమై బాధితుని కుటుంబ సభ్యులు ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఆదేశాలతో ఆస్పత్రి అధికారులు దిగొచ్చి రోగికి అరోగ్యశ్రీ కింద వైద్యం అందించారు. విశాఖలో రెండు కిడ్నీలు చెడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడి విషయంలో అక్కడి ఓమ్నీ ఆర్కే ఆస్పత్రి వైద్యులు వ్యవహరించిన తీరు ఇదిగో ఇలా ఉంది..విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని రేబాక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్‌ (9)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో అతడిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపించారు.

ఆస్పత్రిలో ఈ బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యానికి నగదు చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో అప్పుచేసి రూ.70 వేలు చెల్లించారు. ఇతర పరీక్షల కోసం మరో రూ.60 వేలు చెల్లించాలన్నారు. ధనోజ్‌ చికిత్సకు ఆర్థిక సాయంచేసి ఆదుకోవాలని తల్లిదండ్రుల అభ్యర్థనను ఈనెల 13న ‘సాక్షి’ ప్రచురించింది. దీనిని ధనోజ్‌ కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో మంత్రి ఆళ్ల నానికి 14 రాత్రి పంపించారు. వీటిని చూసిన మంత్రి 16న ఏలూరులో ఉన్న తన ఇంటికి రావాలని ధనోజ్‌ కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పగా వారు మంత్రి ఇంటికి వెళ్లారు.

బాబు పరిస్థితిని వివరించి తమ బిడ్డను బతికించాలని వేడుకున్నారు. దీంతో బాలుడికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించాలని, ఇప్పటికే ఆస్పత్రికి చెల్లించిన సొమ్మును తిరిగిచ్చేయాలని నాని ఆదేశించారు. మరోవైపు.. సోమవారం ఉదయం జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ రవిచంద్ర పాడి ఓమ్నీ ఆర్కే ఆస్పత్రిని సందర్శించారు. బాలుడికి డయాలసిస్, చికిత్స కొనసాగించాలని, ఇప్పటికే వసూలుచేసిన రూ.70 వేలను వెనక్కివ్వాలని ఆస్పత్రి ఏజీఎం (ఆపరేషన్స్‌) గణేష్‌ను ఆదేశించారు. ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి నోటీసులు జారీచేశారు. కాగా, మెరుగైన వైద్యం కోసం ధనోజ్‌ను మంగళవారం మైక్యూర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. 

సీఎం ఆశయ స్ఫూర్తితోనే..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సరైన వైద్యం అందాలి.. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ మేరకే స్పందించి ఆదేశాలిచ్చాను.
– ఆళ్ల నాని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి 

మరిన్ని వార్తలు