12న ఆర్కిటెక్చర్ కోర్సులకు నోటిఫికేషన్

8 Sep, 2015 09:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ కోర్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కేవలం అయిదు కాలేజీలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ (జేఎన్‌యూఏఎఫ్) పరిధిలో వీటికి అఫిలియేషన్ ఉండేది.

రాష్ట్ర విభజనతో ఈ వర్సిటీ పదో షెడ్యూల్‌లో చే రడంతో తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొంది. పదో షెడ్యూల్‌లోని సంస్థలు ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ఏపీలోని ఆర్కిటెక్చర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జేఎన్‌యూఏఎఫ్ ఇటీవల ప్రవేశాల ప్రకటన విడుదల చేసినా అందులో ఏపీలోని కాలేజీలను చేర్చలేదు. కేవలం తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే ప్రవేశాలుంటాయని స్పష్టంచేసింది. దీంతో ఏపీలోని కాలేజీలకు వేరుగా ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు సోమవారం మండలి ఛైర్మన్ ప్రొఫెసర్  ఎల్.వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్ కాలేజీలు కాకినాడ జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ను తీసుకోవాలి. అప్పుడే ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నారు. కొన్ని కాలేజీలు ఏయూ నుంచి అఫిలియేషన్‌ను తీసుకుంటామని పేర్కొనడంతో అందుకు మండలి అంగీకరించింది. ఈనెల 12న ఈ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని సెట్ల అడ్మిషన్ల ప్రత్యేకాధికారి రఘునాథ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.
 

మరిన్ని వార్తలు