మోగింది నగారా

6 Mar, 2014 02:08 IST|Sakshi
మోగింది నగారా
  • ఏప్రిల్ 12న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్
  •  19 వరకు నామినేషన్ల స్వీకరణ       
  •  21న నామినేషన్ల పరిశీలన
  •  23న నామినేషన్ల ఉపసంహరణ    
  •  మే 7న పోలింగ్
  •  జిల్లా ఎన్నికల అథారిటీగా కలెక్టర్  
  •  3156 పోలింగ్  కేంద్రాలు
  • సాక్షి, చిత్తూరు: అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలో మార్చి 5 (బుధవారం) నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. జిల్లాలో మే 7న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 14 అసెంబ్లీ, రాజంపేట, తిరుపతి, చిత్తూరు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జిల్లా జనాభా 42 లక్షలు. వీరిలో 29 లక్షల 500 మంది 2014 ఫిబ్రవరి నాటికి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
     
     ఎన్నికల షెడ్యూల్ ఇలా..
     ఏప్రిల్ 12న జిల్లాలోని 14 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు.
         
     ఏప్రిల్ 12 నుంచి 19వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయదలచిన వారు సంబంధిత రిట ర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు దాఖలు చేయచ్చు.
         
     ఏప్రిల్ 21న నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు.
         
     ఏప్రిల్ 23న ఎన్నికల నుంచి తప్పుకోవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.
     
     అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు.
         
     మే7న జిల్లా వ్యాప్తంగా 3,156 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
         
     మే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
     
     అమలులోకి ఎన్నికల కోడ్..
     ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలోని 14 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మార్చి 5వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్లు లెక్క. మే 16న ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు ఈ కోడ్ అమలులో ఉంటుంది. ఇప్పటికే మున్సిపల్ కోడ్ ఉంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాజకీయపార్టీలు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు తాయిలాలు ఇచ్చేందుకు, ప్రలోభపెట్టేందుకు అవకాశం లేదు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తుంటే నేరుగా జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ రాంగోపాల్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయచ్చు.
     
     నిబంధనలివీ...
     మార్చి 5 నుంచి మే 16వ తేదీ వరకు అధికారిక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడానికి లేదు.
     
     కరువు సహాయక చర్యలు, తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు విడుదల వంటివి ఎన్నికల కమిషన్ అనుమతితో కలెక్టర్ చేపడతారు.
     
     ప్రజలను ప్రలోభపెట్టే దిశగా నగదు, బహుమతులు, చీరలు, నగదు ఆన్‌లైన్ బదిలీ నిషేధం.
     
     రాజకీయ పార్టీలు సమావేశాలు, సభలు పెట్టాలన్నా సంబంధిత ఎన్నికల అధికారి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి.
     
     వాహనాలను ప్రచారానికి వాడుకోవాలన్నా, ఎన్నికల రో జు తిరగాలన్నా ఎన్నికల అధికారి అనుమతి తప్పనిసరి.
     
     జిల్లాలోని 66 మండలాల్లో, ఆరు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
     
     ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు పత్రికల్లో వచ్చే వార్తలు ఆధారంగా జిల్లా ఎన్నికల అథారిటీ విచారణ జరపడం, చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి.
     
     పదవీ కాలం ముగిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గన్‌మెన్లు ఉన్నా వారు కేవలం రక్షణకే. పోలింగ్‌బూత్‌ల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండదు.
     
     అనుమతించిన సమయం వరకే ఎన్నికల ప్రచారం సాగించాల్సి ఉంటుంది.
     
     ప్రయివేట్ ఆస్తులకు సంబంధించి యజమాని అనుమతి లేకుండా పోస్టర్లు అతికించడం, కటౌట్లు పెట్టడం చేస్తే ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేస్తారు.
     
     ఎన్నికల కమిషన్ విధి విధానాలకు లోబడే అభ్యర్థులు ఎన్నికల వ్యయం చేయాల్సి ఉంటుంది.
     
     ఎన్నికలు జరిగే అసెంబ్లీలు స్థానాలు:
     తిరుపతి, పుంగనూరు, చిత్తూరు, తంబళ్లపల్లె, కుప్పం, జీడీనెల్లూరు(ఎస్సీ), చంద్రగిరి, సత్యవేడు(ఎస్సీ), పూతలపట్టు(ఎస్సీ), నగరి, శ్రీకాళహస్తి, పీలేరు, పలమనేరు, మదనపల్లె.
     
     లోక్‌సభ స్థానాలు:
     తిరుపతి(మూడు అసెంబ్లీస్థానాలు), రాజంపేట (నాలుగు అసెంబ్లీస్థానాలు), చిత్తూరు (ఏడు అసెంబ్లీస్థానాలు)

మరిన్ని వార్తలు