మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ విడుదల

25 Mar, 2017 17:47 IST|Sakshi
మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ విడుదల

► ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
► జిల్లాలో 401 షాపులకు 31న లాటరీ

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని 401 మద్యం దుకాణాలకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో శుక్రవారం నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సీహెచ్‌ గోపాలకృష్ణ వెల్లడించారు. తన కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ ప్రక్రియ హెచ్‌టీటీపీ://202.56. 199.158 నెట్‌ అడ్రస్‌ ద్వారా ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను 30వ తేదీ అర్ధరాత్రి 12గంటలలోపు సంబంధిత ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు అందజేసి ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు. 31వ తేదీన బాలాజీ నగర్‌లోని కేపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో లాటరీ తీస్తామని డీసీ తెలిపారు.  జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు ఉన్న 95 మద్యం దుకా ణాలకు లైసెన్స్‌ కాల పరిమితి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2019 జూన్‌ 30 వరకూ ఉంటుందన్నారు. జాతీయ రహదారులకు దూరంగా ఉన్న 306 షాపులకు జూలై ఒకటి నుంచి 2019 జూన్‌ 30 వరకూ ఉంటుందని ఆయన వివరించారు.

నగరం నుంచి వెళుతున్న జాతీయ రహదారి వెంబడి ఉన్న 38 మద్యం దుకాణదారులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నందున ప్రస్తుతానికి వారిని అక్కడి నుంచి తొలగించలేమని, ఆనందపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వాటికి నోటీసులు జారీ చేశామని డీసీ చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌వీవీఎన్‌ బాబ్జిరావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుదారులకు సూచనలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత వచ్చే ఫారం ఎ3(బి), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఫారం –ఆర్‌1, ఎంట్రీపాస్‌ ఫారం ఇ1లను జతపరిచి సంబంధిత ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు అందజేయాలి. దరఖాస్తు రుసుముగా రూ.5 వేలు చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ రుసుముగా మండలాల్లో రూ.50 వేలు, మున్సిపాలిటీల్లో రూ.75వేలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.లక్ష వసూలు చేస్తారు. ఇది తిరిగి ఇవ్వరు. ఇక మిగతా నిబంధనలు ఎప్పటిలానే ఉన్నాయి. ఆధార్, పాన్‌ కార్డు తప్పనిసరి.
లైసెన్స్‌ ఫీజు
ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ ప్రకారం లైసెన్సు ఫీజులు భారీగా తగ్గించారు. అయితే తగ్గిన మొత్తాన్ని ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో తిరిగి వసూలు చేయనున్నారు. కార్పొరేషన్‌ లిమిట్స్‌కు  ఐదు కిలోమీటర్లు, మున్సిపాలిటీ లిమిట్స్‌కు రెండు కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న షాపులకు కార్పొరేషన్, మున్సిపాటిలీలకు వర్తించే ఫీజులే వర్తిస్తాయి. లాటరీ ద్వారా లైసెన్సు పొందిన వారు వెంటనే ఏడాది లైసెన్సు ఫీజు, పర్మిట్‌ రూమ్‌ దరఖాస్తు ఫీజు రూ.10వేలు, పర్మిట్‌ రూమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.50వేలు లాటరీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌లో చెల్లించాలి. ఒక షాపునకు ఒక్కరే దరఖాస్తు చేయాలి. అంతేకాదు లాటరీ ప్రక్రియకు పిలిచినప్పుడు దరఖాస్తుదారుడు ఆ ప్రదేశంలో లేకపోతే షాపు ఇవ్వరు. లైసెన్స్‌దారుడు నిర్దేశించిన పరిధిలో అవకాశం లేకపోతే, ఏదో ఒక చోట దుకాణం పెట్టుకునే వెసులుబాటు కల్పించింది.

మరిన్ని వార్తలు