ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ నావెల్ ఫ్లీట్

22 May, 2015 03:25 IST|Sakshi

79 దేశాల నావికాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం ఆధ్వర్యంలో విశాఖ సముద్రతీరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఇంటర్నేషనల్ నావెల్ ఫ్లీట్ జరగనుంది. ఫ్లీట్ నిర్వహణపై హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, నావికాదళ ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూలో పాల్గొని నగరానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ వివరాలను గురువారం మీడియాకు వివరించారు. మన దేశంలో ప్రతీ ఐదేళ్లకొకసారి జాతీయ స్థాయిలో ప్రెసిడెన్షియల్ నావెల్ ఫ్లీట్స్ నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో రెండేళ్లకొకసారి  నావెల్ ఫ్లీట్స్ జరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో నావెల్ ఫ్లీట్ జరగడం విశాఖలో ఇదే తొలిసారి.
 
 దేశంలో ఇది రెండోసారి. 2001లో ముంబయిలో తొలి అంతర్జాతీయ ఫ్లీట్ జరిగింది. విశాఖలో  ఫ్లీట్‌కోసం భారత్‌తో పాటు 79 దేశాల నావికాదళాలకు చెందిన నౌకలు ఇక్కడ విన్యాసాలు చేయనున్నాయి. 45 దేశాలు అంగీకారం తెలియచేశాయి. ఫ్లీట్‌లో పాల్గొనే దేశాలతో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జి, ప్రధాని నరేంద్రమోదీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, గవర్నర్లు పలుదేశాధినేతలుకూడా పాల్గొనే అవకాశాలున్నాయి. ఏర్పాట్లు చేసేందుకు కోస్టల్ బ్యాటరీ వద్ద సముద్ర తీరాన్ని నావికాదళం తమ స్వాధీనంలోకి తీసుకోనుంది. ఫ్లీట్ 6వ తేదీనుంచి ప్రారంభం కానుండగా నాల్గవ తేదీ నుంచే కార్యక్రమాలు మొదలవుతాయని కలెక్టర్ యువరాజ్ చెప్పారు.

మరిన్ని వార్తలు